శానిటైజ‌ర్లు అధికంగా ఉప‌యోగిస్తున్నారా!

హైద‌రాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తితో చేతుల పరిశుభ్రతకు ప్రాధాన్యం పెరిగింది. ఎక్కడికి వెళ్లినా శానిటైజర్‌ రాసుకోవడం, సబ్బు నీళ్లతో కడగడం షరా మామూలుగా మారింది. స్నేహితులు, సన్నిహితులను కలిసి రాగానే చేతులకు శానిటైజర్‌ రాసుకోవడం పరిపాటైంది. పిల్లల చేతులను సైతం శానిటైజర్‌తో శుభ్రం చేస్తున్నారు. వంట చేసే సమయంలోనూ శానిటైజర్‌ను రాసుకోవడం మానడం లేదు. అయితే.. శానిటైజర్‌తో ఎంత ప్రయోజనం ఉందో అంతే నష్టం కూడా ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా గృహిణులు, పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

మ‌న అర‌చేతుల్లో ఉండే కొన్ని బ్యాక్టీరియాలు మ‌న శ‌రీర ఆరోగ్యాన్ని ర‌క్షిస్తాయి. మ‌నం అధిక మోతాదులో శానిటైజర్ వాడటం వల్ల మన అరచేతుల్లోని మంచి బ్యాక్టీరియా చనిపోతుంది. మంచి బ్యాక్టీరియా మన శరీరంలోకి వెళ్లకపోతే మనం రోగాల బారిన పడటం ఖాయం. అంతేకాకుండా తరచుగా శానిటైజర్ వాడుతున్నట్లయితే చేతుల్లో ఉండే చెడు బ్యాక్టీరియా శక్తివంతంగా తయారవుతుంది. శానిటైజర్లకు అలవాటుపడి, నిరోధక శక్తిని పెంచుకుంటుంది. ఇక మనం శానిటైజర్తో స్నానం చేసినా లాభం లేకుండా పోతుంది. అయితే మనం శానిటైజర్ను ఎక్కువగా వాడుతున్నామా లేదా తెలుసుకోవటం ఎలా అన్నది కొంచెం కష్టం. కానీ, కొన్ని సందర్భాలలో శానిటైజర్ వాడకుండా ఉండటమే చాలా మంచిది.

  1. సబ్బు, నీరు అందుబాటులో ఉన్నప్పుడు కచ్చితంగా శానిటైజర్ వాడకానికి దూరంగా ఉండండి. ఓ 20 సెకన్ల పాటు సబ్బు నీళ్లతో చేతుల్ని కడుక్కోవటం ద్వారా క్రిముల్ని తరిమికొట్టొచ్చని ‘యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్’ చెబుతోంది.
  2. మీ చేతులకు విపరీతంగా దుమ్ము, ధూళీ అంటుకున్నప్పుడు కూడా శానిటైజర్ను ఉపయోగించకండి. చేతులు ఎక్కవ అపరిశుభ్రంగా ఉన్నపుడు ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లు ఇంకా అపరిశుభ్రతను సృష్టిస్తాయి. అంతేకాకుండా క్రిముల్ని చంపడంలోనూ విఫలమవుతాయి.
  3. చుట్టుప్రక్కల ఉన్న వారు తుమ్మినా, దగ్గినా కొంతమంది వెంటనే శానిటైజర్ రాసుకుంటుంటారు. ఇలా చేయటం వల్ల ఏ లాభమూ ఉండదు. గాల్లోని క్రిములను శానిటైజర్ చంపలేదని గుర్తించాలి. అదో భయానికి గురై తరచూ దాన్ని వాడటాన్ని తగ్గించుకోవాలి

చిన్న‌పిల్లలకు దూరంగా ఉంచండి

పిల్లలకు అంద‌కుండా శానిటైజర్స్ దూరంగా ఉంచ‌డం మంచిది. ఎందుకంటే వారు గనుక శానిటైజర్ను శరీరంలోకి తీసుకున్నట్లయితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. అందుకని, పిల్లలు శానిటైజర్లను చేతుల్లోకి తీసుకోకుండా ఉండేలా జాగ్రత్త వహించాలి.

ఎలాంటి శానిటైజర్లు మేలు..

  • జిగురు, నురుగు మాదిరి కంటే ద్రావణంగా ఉండే శానిటైజర్లే మంచిది.
  • చేతుల్లో వేసుకుని రుద్దుకున్న తర్వాత ఒక నిమిషంలో అది ఆవిరవ్వాలి. అలా కాకుండా చేతులకు అంటుకుని ఉంటే చర్మ సంబంధమైన సమస్యలు వస్తాయి.
  • శానిటైజర్లతో 60–90 శాతం ఆల్కహాల్‌ ఉండాలి. అంతకంటే తగ్గినా, ఎక్కువగా ఉన్నా ఆశించిన ఫలితం రాకపోగా కొత్త సమస్యలు వస్తాయి.
  • కనీసం 20–30 సెకన్ల పాటు చేతులకు రుద్దుకోవాలి.

సబ్బుతో కడుక్కుంటే మేలు..

శానిటైజర్ల వాడకంపై విస్తృతంగా ప్రచారం జరగడంతో పలు నాసిరకం శానిటైజర్లు మార్కెట్లోకి వచ్చాయి. వాటి గాఢత ఎక్కువ ఉండటంతో ఇబ్బందులు తలెత్తే ప్రమాదముంది. శానిటైజర్ల ధరలు సైతం ఎక్కువగానే ఉన్నాయి. సబ్బు అయితే తక్కువ ధరలో లభ్యమవుతుంది. చేతులు పూర్తిస్థాయిలో శుభ్రమవుతాయి. వైద్యులు సైతం సబ్బుతో చేతులు శుభ్రం చేసుకునేందుకు ప్రాధాన్యమివ్వాలని సూచిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.