అల్లూరికి సేవలు చేసిన బాలుదొర మృతి

రాజవొమ్మంగి (తూర్పుగోదావరి):మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు సేవలందించిన ఓ శతాధిక వృద్ధుడు మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం కొండపల్లికి చెందిన బీరబోయిన బాలుదొర (111) ఆదివారం తన నివాసంలో మరణించారు. కొండపల్లి కేంద్రంగా అల్లూరి సీతారామరాజు 1924 మే నెలలో బ్రిటిష్ వారిపై చివరి పోరాటం చేశారు. అప్పట్లో అల్లూరి సీతారామరాజు ఎత్తయిన కొండలపై ఉండేవారు. ఆ సమయంలో బాలుడిగా ఉన్న బాలుదొర అల్లూరికి ఆహార పదార్థాలు అందజేసేవారు. అల్లూరిని దగ్గరగా చూసే భాగ్యం తనకు కలిగిదంటూ నాటి జ్ఞాపకాలను బాలుదొర స్థానికులతో ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండేవారు. వయసు మీద పడడంతో ఇటీవల మంచం పట్టిన ఆయన ఆదివారం కన్నుమూశారు.