కాంగ్రెస్ వ్యవస్థ కుప్పకూలింది: గులాంనబీ ఆజాద్
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌పార్టీ వ్యవస్థ సంస్థాగతంగా కుప్పకూలిందని, నాయకులు ఫైవ్‌స్టార్ హోటళ్లను వీడి క్షేత్రస్థాయిలో పనిచేయాలని పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ అభిప్రాయపడ్డారు. నాయకత్వాన్ని నిందించడం వల్ల ప్రయోజనమేమీ లేదని, మండల- పంచాయతీ స్థాయి నుండి పార్టీని తిరిగి నిర్మించాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. ఆ వ్యవస్థలో ఎవరైనా నేత ఎన్నికైతే అది సమర్థంగా పనిచేస్తుందని, ప్రస్తుత వ్యవస్థ వల్ల లాభమేమీ లేదన్నారు. బీహార్ ఎన్నికల తరువాత తొలిసారి ఆయన స్పందించారు. కపిల్ సిబల్ విమర్శలను ఎత్తిచూపుతూ ఇది నాయకత్వ సమస్య కాదన్నారు. నాయకున్ణి మార్చేస్తే బీహార్, మధ్యప్రదేశ్, యూపీల్లో గెలిచేస్తామనుకుంటే పొరపాటని, వ్యవస్థను మార్చినప్పుడు అది సాధ్యమవుతుందన్నారు. ప్రజలకు, కాంగ్రెస్‌నేతలకు మధ్య సంబంధం తెగిపోయిందని అభిప్రాయపడ్డారు. సిబల్ విమర్శలపై మరో కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ స్పందిస్తూ.. కాంగ్రెస్‌లో నాయకత్వ సంక్షోభం లేదన్నారు. సోనియా, రాహుల్‌గాంధీల నాయకత్వానికి అందరి మద్దతు ఉందని పేర్కొన్నారు. పార్టీ నాయకుల అభిప్రాయాలను అధిష్టానం గౌరవిస్తుందని తెలిపారు. బీహార్‌లో పార్టీ పరిస్థితిపై కపిల్ సిబల్ చెప్పిన దాంట్లో వాస్తవముందన్నారు.