హైదరాబాద్‌కు బయల్దేరిన 64 దేశాల రాయబారుల బృందం

హైదరాబాద్ : కరోనా టీకా అధ్యయనానికి సుమారు 64 దేశాల రాయబారులు, హైకమిషనర్ల బృందం బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో బయల్దేరింది. మరికాసేపట్లో ఈ ప్రత్యేక విమానం బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకోనుంది. అక్కడ్నుంచి ఈ బృందం జీనోమ్‌వ్యాలీలోని భారత్ బయోటెక్, బయోలాజికల్– ఈ సంస్థలను సందర్శించనున్నది. కరోనా కట్టడికి దేశంలో చేపట్టిన పరిశోధనలు, వ్యాక్సిన్ ఉత్పత్తి అవకాశాలు, టీకా పంపిణీ కార్యాచరణ ప్రణాళిక తదితర అంశాలపై అధ్యయనం చేస్తున్నది. ఇందులో భాగంగా జీనోమ్‌వ్యాలీని సందర్శించనున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్ టీకా ప్రస్తుతం మూడోదశ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. బయోలాజికల్– ఈ సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఫేజ్–1, 2 క్లినికల్ ట్రయల్స్‌కు కేంద్రం గత నెలలో అనుమతి ఇచ్చింది. ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు వచ్చి భారత్ బయోటెక్‌ను సందర్శించిన సంగతి తెలిసిందే. కాగా పెద్ద సంఖ్యలో విదేశీ రాయబారులు, హైకమిషనర్లు తెలంగాణను సందర్శించడం ఇదే ప్రథమం. వారి పర్యటన కోసం రాష్ట్ర సర్కార్ భారీ ఏర్పాటు చేసింది.