అమ‌రజీవి పొట్టి శ్రీరాములు వర్థంతి..

మండపేట(CLiC2NEWS) : రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు అని మున్సిపల్ కమిషనర్ టి రామ్ కుమార్ అన్నారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో స్వర్గీయ పొట్టి శ్రీరాములు వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. 69వ వర్థంతిని పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి జ్యోతి వెలిగించి అంజలి ఘటించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ వేగుళ్ల నారయ్యబాబు, కౌన్సిల్ విప్ పోతంశెట్టి ప్రసాద్, షేక్ అండ్ షేక్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అలీఖాన్ బాబా, వైసీపీ టౌన్ కన్వీనర్ ముమ్మిడివరపు బాపిరాజు, ఉండ్రాసపు అర్జున్ తదితరులు మహనీయుని చిత్రపటానికి పువ్వులు చల్లి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తెలుగు వారి హక్కుల సాధనకోసం వీరోచితంగా పోరాడిన యోధుడు పొట్టి శ్రీరాములు అన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికన తెలుగు వారందరికీ ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే ఉద్దేశంతో ఆమరణ దీక్ష చేపట్టి, 58 రోజులు నిద్రా హారాలు లేకుండా చివరికి ప్రాణాలు అర్పించారని అన్నారు. ఆయన త్యాగ ఫలితమే మన ఆంధ్ర రాష్ట్రం అవతరణ అని అన్నారు. ఆయన చేసిన త్యాగం మరువలేనిదని కొనియాడారు. తెలుగు వారందరూ పొట్టి శ్రీరాములును స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మహాత్మా గాంధీ స్ఫూర్తితో స్వాతంత్రోద్యమ పోరాటంలో పాల్గొన్నారని అన్నారు. అదేవిధంగా క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి జైలు కెళ్లడం జరిగిందన్నారు. స్వాతంత్య్రం అనంతరం మన రాష్ట్రం మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేదని అన్నారు. ఆ తరుణంలో మద్రాసు ప్రజలు తెలుగు వారిని ద్వితీయ శ్రేణి మనుషులుగా పరిగణించి చులకన భావంతో చేసేవారని అన్నారు. పొట్టి శ్రీరాములు అప్పటినుండి తెలుగు వారి హక్కుల కోసం, తెలుగు వారి ఔన్నత్యం కోసం సంకల్పించి ఆమరణ దీక్ష చేపట్టి సొంత ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించి పెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నిర్మలాకుమారి, ఏఈ శ్రీనివాస్, డిఈ కె సత్యనారాయణ, వైసీపీ నాయకుడు గురజాపు శ్రీనివాస్, మున్సిపల్ సిబ్బంది వారా రాజశేఖర్, ఈలేటి శ్రీనివాస్, పాలచర్ల లీలాకృష్ణ, అశోక్, పిట్టా రాజబాబు, సతీష్, గోపి, శీతిని ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.