AP: మహిళలకు శుభవార్త.. ఆగస్టు 15 నుండి బస్సుల్లో ఉచిత ప్రయాణం

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త తెలిపారు. ఆగస్టు 15 నుండి బస్సుల్లో ఉచిత ప్రయాణం సదుపాయం కల్పిస్తామన్నారు. శనివారం కర్నూలులో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సిఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇల్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుతామని ప్రజలతో ప్రమాణం చేయించారు. ప్రతి నెలా మూడో శనివారం ఇళ్లు, పరిసరాల్లోని శుభ్రతపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం పెంచాలని విజ్ఞప్తి చేశారు.
యోగా డేను నెల రోజుల పాటు నిర్వహిస్తామని, ప్రపంచం గర్వించేలా విశాఖలో యోగా డే నిర్వహిస్తామని సిఎం తెలిపారు. ఆ రోజు ప్రధాని నరేంద్ర మోడీ కూడా వస్తున్నారన్నారు. ప్రజలు ప్రతి ఒక్కరూ రోజుకు అరగంట యోగా చేయాలని కోరుతున్నానన్నారు. ఆఫ్‌లైన్ ఆన్‌లైన్లో యోగా శిక్షణ ఇస్తామని.. నెట్ జీర్ వేస్ట్ కోసం ప్రజలంతా ఆలోచించాలన్నారు.
ప్రపంచంలో ఏ వస్తువూ వేస్ట్ కాదని.. అన్నీ ఏదో ఒక రూపంలో ఉపయోగపడతాయన్నారు. తడిచెత్త, పొడిచెత్తను వేరుచేయాలని సూచించారు. అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలో ఎక్కడా చెత్త లేకుండా చూడాలని ఆదేశించానన్నారు. చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని.. దీనికి రెండు ప్రాజెక్టులు పనిచేస్తున్నాయని తెలిపారు. రాజమహేంద్రవరం, విజయవాడ, నెల్లూరు, కడప లో కూడా ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నామని సిఎం వెల్లడించారు. గ్రామాల్లో చెత్తను ఎరువుగా మార్చే కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామిన, చెత్తను వేరు చేసి రీసైక్లింగ్ కు పంపిస్తే.. అవి మళ్లీ ఉపయోగపడతాయన్నారు.