గుంటూరు ఆస్పత్రిలో జిబిఎస్ బాధితురాలు మృతి

గుంటూరు (CLiC2NEWS): ఎపిలో గులియన్-బారి సిండ్రోమ్ (జిబిఎస్) అనే నరాల సంబంధింత వ్యాధి కేసులు ఒక్కసారిగా పెదుగుతున్నాయి. గుంటూరు ప్రభుత్వాసుపత్రికి ఫిబ్రవరి 11వ తేదీన 11 కేసులు వచ్చినట్లు సమాచారం. కాకినాడలో కూడా ఇటీవల ఇద్దరు బాదితులు ఆస్పత్రిలో చేరారు. రాష్ట్రం మొత్తంలో ప్రభుత్వాసుపత్రిలో ఈ వ్యాధితో 17 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆదివారం గుంటూరు జిజిహెచ్‌లో చికిత్స పొందుతున్న కమలమ్మ అనే మహిళ మృతి చెందింది. ఆమె తీవ్ర జ్వరం, కాళ్లు చచ్చుబడి పోవడంతో ఆమెకు గత కొన్ని రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.
జిబియస్ అంటు వ్యాధి కాకపోయినా ఒక్క సారిగా కేసులు పెరగడంతో ప్రజలలో ఆందోళన కలిగిస్తోంది. ఇది ఒక రకంగా పక్షవాతం లాగా.. కండరాలు చచ్చుబడతాయి. ఈ వ్యాధి ప్రాణాంతకం కాకపోయినా.. సకాలంలో గుర్తించి చికిత్స పొందాలని.. లేకపోతే ప్రమాదం సంభవిస్తుందంటున్నారు. ఈ వ్యాధి కలుషితమైన నీరు, ఆహారం తీసుకున్నా, పెద్ద ఆపరేషన్లు చేయించుకున్నా ఈ వ్యాధి సోకే అవకాశాలున్నాయంటున్నారు. కాళ్లు, చేతుల్లో బలహీనత .. కొద్ది వారాల ముందు విరేచనాలు, కడుపునొప్పి ఉన్నాయా అనేది చూడాలి. జిబిఎస్ లక్షణాలున్నాయని అనుమానిస్తే వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలి. నర్వ్ కండక్షన్, ఎలక్ట్రో మయోగ్రఫి, సిఎన్ ఎఫ్ , ఎంఆర్ ఐ వంటి పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ చేస్తారు.