పార్లమెంట్‌లో అరకు కాఫీ రుచులు..

అమరావతి (CLiC2NEWS): పార్లమెంట్‌లో ఆరకు కాఫీ స్టాల్ ఏర్పాటు చేయడం మనందరికీ, గిరిజన రైతులకు గర్వకారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అరకు కాఫీ గురించి మన్‌కీ బాత్‌లో ప్రస్తావించినందుకు ప్రధాని మోదీకి, పార్లమెంట్‌లో కాఫీ స్టాల్ ఏర్పాటు చేసేందుకు అనుమతిచ్చిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఈ సందర్బంగా సిఎం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. పార్లమెంట్ ప్రాంగణంలో కాఫీ స్టాళ్లను ఏర్పాటు చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ సిఎం కృతజ్ఞతలు తెలియజేశారు.
సోమవారం పార్లమెంట్ ఆవరణలోని లోక్‌సభ, రాజ్యసభ పరిధుల్లో రెండు అరకు కాఫీ స్టాళ్లు ఏర్పాటు చేశారు. లోక్‌సభ ప్రాంగణంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అరకు స్టాల్‌ను ప్రారంభించారు. రాజ్యసభ ప్రాంగణంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఈకార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎపికి చెందిన కూటమి పార్లమెంట్ సభ్యులు, ఎపి గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్లో మన అరకు కాఫీ స్టాళ్లను ప్రారంభించేందుకు ప్రోత్సహించిన సిఎం చంద్రబాబుకు ఈ సందర్బంగా విజయనగరం ఎంపి కలిశెట్టి అప్పలనాయడు కృతజ్ఞతలు తెలియజేశారు.
అరకు కాఫీ రుచులకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో సిఎం చంద్రబాబు.. ఎక్కడికి వెళ్లినా, తాను సమావేశమయ్యే ప్రముఖులకు అరకు కాఫీతో ప్రత్యేకంగా రూపొందించిన గిప్ట్ ప్యాక్‌లను అందజేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రానికి వచ్చే ప్రముఖులకు సైతం ఈ గిప్ట్ ప్యాక్‌లను ఇస్తున్నారు. దావోస్ సదస్సులో కూడా ఆరకు కాఫీస్టాల్‌ను ఏర్పాటు చేయించారు. ఇక నుండి పార్లమెంట్‌లో కూడా అరకు కాఫీ రుచులు ఆస్వాదించబోతున్నారు.