TS: అన్ని పిహెచ్‌సీల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు..
హైదరాబాద్ (CLiC2NEWS): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పిహెచ్‌సి) స్థాయికి విస్తరింపజేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రంలోని పిహెచ్‌సిల పనితీరుపై మంత్రి జిల్లాల వైద్యాధికారులు, పథకాల అధికారులు, సూపర్‌వైజర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పిహెచ్‌సిల పరిధిలో ప్రజల ఆరోగ్య పరిస్థితులు, వారికి అందుతున్న వైద్య సేవలు, గర్భిణులకు వైద్యసేవలు, వ్యాక్సినేషన్, అధిక రక్తపోటు, మధుమేహం తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మందల పంపణీ, పరీక్షలు ఇతర అంశాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య సంరక్షణలో పిహెచ్‌సిలది ముఖ్య పాత్ర అని, గర్భిణి దశలో తప్పనిసరిగా 4 సార్లు పరీక్షలు నిర్వహణతో మాతా, శిశు మరణాలు తగ్గించవచ్చన్నారు. ప్రతి పిహెచ్‌సి పరిధిలో 100% ఆసుపత్రి ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. టెలి వైద్య విధానాన్ని వినియోగించుకొని, పిహెచ్‌పి స్థాయిలోనే స్పెషాలిటి, సూపర్ స్పెషాలిటి వైద్యసేవలు అందించాలన్నారు.
అన్ని పిహెచ్‌సిలు ఆరోగ్య ట్రస్టు అనుసంధాన ఆసుపత్రుల జాబితాలో నమోదు చేసుకోవాలని మంత్రి సూచించారు. దీని ద్వారా పిహెచ్‌సిలు ఆర్ధికంగా బలోపేతం అయ్యే అవకాశం ఉందని, పిహెచ్‌సిలలో తేలికపాటి శస్త్ర చికిత్సలు చేస్తారని తెలపారు. ఈ సేవలు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్యలో పొందే అవకాశం ఉంటుంది. వీటిని నిర్వహించినందుకు ఆరోగ్యశ్రీ ట్రస్టు నుండి నిధులు పిహెచ్‌సిలకు చేరతాయి. సాధారణ ప్రసవాలు పెంచాలనే లక్ష్యంతో వైద్యులకూ, నర్సులకు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వబోతున్నట్లు మంత్రి హరిశ్ రావు వెల్లడించారు.