hyd: వైభవంగా నిర్వహించేలా బోనాలు ఏర్పాట్లు: మంత్రి ఇంద్రకరణ్

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల పండుగను వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సహచర మంత్రులు తలసాని, మహమూద్ అలీ సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. బోనాల ఏర్పాట్లు, నిర్వహణపై అరణ్య భవన్‌లో మంగళవారం మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని, మహమూద్ అలీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బోనాలకు వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీలు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.
భక్తులు తప్పనిసరిగా మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి అమ్మవారిని దర్శనాలు చేసుకోవాలని కోరారు. ఆలయాల వద్ద కూడా మాస్కులను, శానిటైజర్ల్ ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ రూ.15 కోట్ల మంజూరు చేశారని పేర్కొన్నారు. ఆ నిధులను సద్వినియోగం చేసుకుని బోనాలను ఘనంగా నిర్వహించాలని మంత్రులు పేర్కొన్నారు. సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.