ఫేక్‌న్యూస్ వ్యాప్తి చేస్తున్న మూడు యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం!
![](https://clic2news.com/wp-content/uploads/2022/12/central-govt-suspended-3-youtube-channels.jpg)
ఢిల్లీ (CLiC2NEWS): కేంద్ర ప్రభుత్వం గురించి అసత్య వార్తలు ప్రసారం చేస్తున్న మూడు యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం నిషేధం విధించింది. న్యూస్ హెడ్‌లైన్స్ సర్కారీ అప్‌డేట్, ఆజ్‌తక్ లైవ్ పేరుతో నిర్వహిస్తున్న ఈ మూడు ఛానెళ్లు నకిలీ సమాచారం వ్యాప్తి చేస్తున్నాయని.. వాటిపై నిషేధం విధించినట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఛానెళ్లకు సమారు 33 లక్షల మందికిపైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నట్లు సమాచారం. ఈ యూట్యూబ్ ఛానెళ్లు ప్రధాని మోడీ, సుప్రీం ధర్మాసనం, సిజెఐ, ఇసి, ఇవిఎంలు, ఆధార్, పాన్‌కార్డ్‌లతో పాటు వివిధ ప్రభుత్వ పథకాల గురించి అసత్య సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయని కేంద్రం స్పష్టం చేసింది.
భవిష్యత్తులో ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరిగేలా సుప్రీం తీర్పు ఇచ్చిందని, బ్యాంక్ ఖాతా లేదా ఆధార్ ఉన్న వారికి ప్రభుత్వం నగదు పంపిణీ చేస్తుందనే అసత్య సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) వెల్లడించింది. అంతేకాకుండా ఆ వార్తలు నిజమేనని ప్రజలను నమ్మించేందుకు ప్రముఖ టివి ఛానెళ్ల లోగోలు, యాంకర్ల ఫొటోలను ఉపయోగిస్తున్నారని తెలిపింది. అందుకే వాటిపై చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.