బాలానగర్ ఫ్లై ఓవర్కు బాబు జగ్జీవన్ రామ్ పేరు: మంత్రి కెటిఆర్

హైదరాబాద్ (CLiC2NEWS): ట్రాఫిక్ కష్టాల్లేని నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దాలని సంకల్పించినట్లు పురపాలక మంత్రి కెటిఆర్ అన్నారు. నగరంలో తొలిసారి ఆరు వరుసలతో నిర్మించిన బాలానగర్ ఫ్లై ఓవర్ను ఆయన ప్రారంభించారు.
నగరంలో ఇవాళ (మంగళవారం) ప్రారంభించుకున్న బాలానగర్ ఫ్లై ఓవర్కు బాబు జగ్జీవన్ రామ్ ఫ్లై ఓవర్గా నామకరణం చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయనకు కేటీఆర్ ఘన నివాళులర్పించారు.
బాలానగర్ ఫ్లై ఓవర్ను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. బాలానగర్ వాసుల 40 సంవత్సరాల కల నెరవేరింది. ఇప్పుడు ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ కష్టాలు పూర్తిగా తొలగిపోయాయి.
జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ సంయుక్తంగా కలిసి బ్రహ్మాండమైన అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. బాలానగర్ పరిధిలో రహదారుల విస్తరణ కూడా చేపడుతామన్నారు. ఫతే నగర్ బ్రిడ్జి పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి అని మంత్రి తెలిపారు.