బెజ్జంకి నరసింహస్వామి జాతర
(బెజ్జంకి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల సంధర్బంగా)

శ్లో||బెజ్జంకి పురావాసో
నృకేసరి భక్తవత్సలా
నారసింహ సమో దేవో
నభూతో నభవిష్యతి ౹౹
బ్రహ్మాండ నాయకుని
బ్రహ్మోత్సవాలంట
భక్తజనకోటికి
కనులపంట
బెజ్జంకి నరసింహ
దివ్యక్షేత్రము జూడ
ఊరువాడల జనులు
కదిలినారంట.
భక్త ప్రహ్లాదుని
కోర్కెను తీర్చ
రాతి స్తంభము
నుండి వచ్చి నావంట
బెజ్జంకి గిరి మెచ్చి
స్వయముగా వచ్చి
చిన్ని గుహలో స్వామి
వెలిసినా వంట.
కాకతీ కాటయ
ఆ గుహ చుట్టు గుడి కట్ట
రామప్ప శిల్పులను
పిలిపించి నాడంట
రంగమంటపమందు
రమణీయ స్తంభాలు
కాకతీ శిల్పులు
చెక్కినారంట.
సంతాన సిద్ధికి
గగన సీమను తాకు
ఆండాళు స్తంభము
నిలిపినారంట
కాల భైరవుడు
క్షేత్ర పాలకుడై
దివ్య క్షేత్రమును
సదా కాపాడునంట
రైతు శకటాలు
గుట్టచుట్టూ కలసి
కదులునంట
చిట్టి బండ్లకు
రెండు మేకలను గట్టి
తిరుగుతుంటే చూడ
ముచ్చటంట.
చైత్ర వెన్నెలలో
రథముపై ఊరేగు
నీ దర్శనమే చాలు
ఈ జన్మకంట
లక్ష్మీనరసింహ స్వామి గోవిందా! గోవిందా!!
నీ నామస్మరణ తో
దివిటీలు వెలిగించి
మా పాపాలు తొలగించె
దేవుడంట.
వరదార్య సేవ
భక్తికి మెచ్చి
ముక్తి నిచ్చి నీవు
మోక్ష మిచ్చితివంట
భక్త వరదుడ వీవు
ఇలివేల్పు గా తలచి
ఇంటింట కొలువై
నిలిచినావంట
-శేషం శ్రీనివాసాచార్య ,
బెజ్జంకి
మరిన్ని `కవిత`ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: వినుడు వినుడు రామ కథ…