హిమ‌య‌త్ సాగ‌ర్‌ను సందర్శించిన పుర‌పాలకశాఖ ముఖ్య కార్యదర్శి

హైదరాబాద్(CLiC2NEWS): హైదరాబాద్ నగరానికి తాగునీటి అవసరాలను తీరుస్తున్న హిమాయత్ సాగర్ మరియు ఉస్మాన్ సాగర్ (గండిపేట)లు గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిండడంతో వీటి గేట్లను ఎత్తి వరద నీటిని మూసీ నదిలోకి వదులుతున్నారు. ఈ సందర్భంగా పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జలమండలి ఎండీ దాన కిషోర్‌తో కలిసి శుక్రవారం నాడు జంట జలాశయాలను సందర్శించారు.

మొదట పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్.. హిమాయత్ సాగర్ జలాశయంను సందర్శించి వరద నీటి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో వంటి వివరాలతో సహా అక్కడి ప్రస్తుత పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ జలాశయం గురించి జలమండలి ఎండీ ని పలు వివరాలు అడగగా.. ఇది వంద సంవత్సరాల చరిత్ర కలిగిన మానవ నిర్మిత కట్టడమని, దీని గేట్లు ఆటోమేషన్ లో కాకుండా ఇప్పటికీ మ్యాన్యువల్ పద్దతిలోనే నిర్వహిస్తామని ఆయన వివరించారు.

హిమాయత్ సాగర్ మరియు ఉస్మాన్ సాగర్ (గండిపేట) జలాశయాల పరివాహక ప్రాంతాల్లో గత వారం నుండి భారీ వర్షపాతం నమోదవుతుండడంతో గత మంగళవారం రోజు హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యానికి (1763.50 అడుగులు) చేరుకోవడంతో, మూడు గేట్లను ఎత్తి 1000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలారని ఎండీ వివరించారు. గురువారం రోజు మరో మూడుగేట్లను ఎత్తి 1700 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలామని తెలిపారు.

దీంతో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ హిమాయత్ సాగర్ ఎగువ ప్రాంతాల్లో ఈ వర్షపాతం ఇలాగే కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో రిజర్వాయర్ మరో రెండు గేట్లు ఒక అడుగు వరకు ఎత్తి వరద నీటిని దిగువకు వదలమని సూచించడంతో జలమండలి అధికారులు రెండు గేట్లతో సహా మొత్తం ఏడు గేట్ల ద్వారా 2400 క్యూసెక్కుల వరద నీటిని దిగువ ఉన్నమూసీ నదిలోకి విడుదల చేస్తున్నారు.

అనంతరం ఆయన ఉస్మాన్ సాగర్ జలాశయాన్ని సందర్శించారు. అక్కడ ఆయన వాల్వ్ రూం, రికార్డ్ రూం లను తనిఖీ చేశారు. వీటిలో పాటు ఆయన అక్కడ ఉన్న గ్రామ్ ఫోన్ పరికరం, దాని పనితీరు వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను సూచించారు.

హిమాయత్ సాగర్ రిజర్వాయర్ మరో రెండు గేట్లు ఎత్తడంతో జలమండలి ఎండీ దాన కిశోర్ సంబందిత అధికారులను అప్రమత్తం చేశారు. జలమండలి సిబ్బంది మూసి నదికి ఇరువైపులా ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని, ప్రజలెవరూ అటువైపుగా వెళ్లొద్దని ఎండీ విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా ఈ రిజర్వాయర్ల లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కాలనీలు, మురికివాడ ప్రాంతాలు మరియు మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు సన్నద్ధం కావాలని హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాల పరిపాలనా యంత్రాంగంతో పాటు.. జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం. సత్యనారాయణ, టెక్నికల్ డైరెక్టర్ రవి కుమార్, సీజీఎమ్ దశరథ్ రెడ్డి, జీఎం రామ‌క్రిష్ణ‌ తో పాటు ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

జంట జ‌లాశ‌యాల వివ‌రాలు :

1. ఉస్మాన్ సాగర్:

ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం : 1790.00 అడుగులు
ప్రస్తుత నీటి స్థాయి : 1785.30 అడుగులు
రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం : 3.90 టీఎంసీ లు
ప్రస్తుత సామర్థ్యం : 2.885 టీఎంసీ లు
ఇన్ ఫ్లో : 400 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో: 100 క్యూసెక్కులు
మొత్తం గేట్ల సంఖ్య: 15 గేట్లు
ఎత్తిన గేట్ల సంఖ్య: 2 గేట్లు

2. హిమాయ‌త్ సాగ‌ర్ :

హిమాయ‌త్ సాగ‌ర్ పూర్తి స్థాయి నీటి మ‌ట్టం : 1763.50 అడుగులు
ప్ర‌స్తుత నీటి స్థాయి : 1762.50 అడుగులు
రిజ‌ర్వాయ‌ర్ పూర్తి సామ‌ర్థ్యం : 2.968 టీఎంసీ లు
ప్ర‌స్తుత సామ‌ర్థ్యం : 2.697 టీఎంసీ లు
ఇన్ ఫ్లో : 1400 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో: 2400 క్యూసెక్కులు
మొత్తం గేట్ల సంఖ్య: 17 గేట్లు
ఎత్తిన గేట్ల సంఖ్య: 7 గేట్లు

Leave A Reply

Your email address will not be published.