పునీత్ రాజ్‌కుమార్ పార్ధీవదేహానికి నివాళులర్పించిన చిరంజీవి, వెంకటేష్ , శ్రీకాంత్, అలీ

బెంగళూరు (CLiC2NEWS): కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ను చివరిసారి చూసేందుకు టాలీవుడ్ ఇండస్ట్రీ కదిలింది. కన్నడ పవర్‌స్టార్ హఠాన్మరణంతో దక్షిణాది సినిమా ఇండస్ట్రీ అంతా విషాదంలో మునిగిపోయింది. ఈయన శుక్రవారం ఉదయం జిమ్ చేస్తూ కుప్పకూలి పడిపోయారు. వెంటనే ఆయనను బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఐసియూకి తరలించి చికిత్స అందిస్తుండగా పునీత్ తుది శ్వాస విడిచారు. పునీత్ పార్ధీవదేహాన్ని అభిమానుల సందర్శనార్ధం బెంగళూరు కంఠీరవ స్టేడియంలో ఉంచారు.
తెలుగు ఇండస్ట్రీ నుంచి పునీత్ ను కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు కదిలారు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ , ఎన్టీఆర్, రానా పునీత్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, హీరో శ్రీకాంత్, అలీ పునీత్ పార్ధీవదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
చిరంజీవి మాట్లాడుతూ.. పునీత్ మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని చిరంజీవి తెలిపారు. చిన్న వయసులోనే పునీత్ మనల్ని వదిలి వెళ్లడం బాధాకరమన్నారు. పునీత్ సోదరుడు శివరాజ్‌ను హత్తుకొని చిరంజీవి ఓదార్చారు. పునీత్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా అని మెగాస్టార్ తెలిపారు. పునీత్ మరణం తీరని లోటని హీరో వెంకటేశ్ అన్నారు. కాగా పునీత్ అంత్య క్రియలను ఆదివారం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు.