Coronaతో అనాథలైన పిల్లలకు ప్రతి నెల రూ.2500..

న్యూఢిల్లీ (CLi2NEWS): దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. మొదటి వేవ్‌తో పోల్చితే సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ మహమ్మారి ఎన్నో కుటుంబాలను చిన్నాబిన్నం చేసింది. కొన్ని కుటుంబాల్లో తల్లితండ్రులకు పిల్లలను దూరం చేస్తే, మరి కొన్ని కుటుంబాల్లో పిల్లలకు వారి తల్లితండ్రులను దూరం చేసింది. ఇలా కొవిడ్‌తో తల్లితండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లల విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ చిన్నారులకు 25ఏళ్లు వచ్చేదాకా ప్రతి నెల రూ.2,500 జమ చేయడంతో పాటు ఉచిత విద్య అందించనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.
కరోనా మృతుల కుటుంబాలకు రూ.50,000 పరిహారం సహా.. దిల్లీలోని 72 లక్షల మంది నిరుపేదలకు.. నెలకు 10 కిలోల ఆహార పదార్థాలు ఉచితంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రేషన్ కార్డు లేని పేదలకూ ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. వీటన్నింటిని కేబినెట్ ఆమోదం పొందిన వెంటనే అమలు చేయనున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు.