రేపు హుజూరాబాద్ ఓట్ల లెక్కింపు..

కరీంనగర్ (CLiC2NEWS): తెలంగాణ‌లోని ఉత్కంఠ రేపిన హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. రేపు (మంగళవారం) కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కాలేజీలో ఓట్ల లెక్కింపు జ‌రుప‌నున్నారు. ఈ లెక్కింపును వివాదాలకు తావులేకుండా, సజావుగా నిర్వహించాలని అధికారులను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ కోరారు.

పోటీచేసిన అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలోనే ఈవీఎంల సీల్‌ తొలగించి ఓట్లు లెక్కించాలని ఎన్నిక‌ల అధికారి ఆదేశించారు. హుజూరాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో శనివారం జరిగిన పోలింగ్‌లో ఓటర్లు భారీగా తరలివచ్చి ఓట్లేశారు. దాంతో రికార్డు స్థాయిలో 86.64 శాతం పోలింగ్‌ నమోదైంది.

కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో పోలీసులతోపాటు కేంద్ర బలగాలతో 144 సెక్షన్‌ విధించి మూడంచెల భద్రతను కల్పించారు. రెండో తేదీన ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పా ట్లు చేస్తున్నట్టు ఆదివారం కరీంనగర్‌లో రిటర్నింగ్‌ అధికారి, హుజూరాబాద్‌ ఆర్డీవో సీహెచ్‌ రవీందర్‌రెడ్డి తెలిపారు. ఓట్ల లెక్కింపునకు 14 టేబుల్స్‌ ఏర్పాటుచేశామని, 22 రౌండ్లలో లెక్కింపు పూర్తిచేస్తామని వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.