Covishield: ప్రైవేటు ఆసుప‌త్రుల‌కు రూ.600

వ్యాక్సిన్ ధ‌ర‌లు ప్ర‌క‌టించిన సీరం సంస్థ

పుణె (clic2news): దేశంలో క‌రోనా ఉధృతి నేప‌థ్యంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియను మ‌రింత వేగ‌వంతం చేసేలా కేంద్రం ఇటీవ‌ల నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. వ్యాక్సిన్ ఉత్ప‌త్తిదారులు 50 శాతం డోసుల‌ను నేరుగా రాష్ట్ర ప్ర‌భుత్వాలు, బ‌హిరంగ మార్కెట్లో అమ్ముకునేందుకు వీలు క‌ల్పించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణ‌యాన్ని స్వాగ‌తించిన సీర‌మ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా.. ప్రేవేటు మార్కెట్లో కొవిషీల్డ్ టీకాల ద‌ర‌ల‌ను బుధ‌వారం ప్ర‌క‌టించింది. దేశంలో
రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు కోవీషీల్డ్ టీకాల‌ను రూ.400కు ఒక డోసు చొప్పున‌ ఇవ్వ‌నున్న‌ట్లు సీరం ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో ఆధార్ పూనావాలా తెలిపారు. ఇక ప్రైవేటు హాస్పిట‌ళ్ల‌ల‌కు ఒక డోసు కోవీషీల్డ్ టీకాను రూ.600కు ఇవ్వ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. సీరం సంస్థ త‌న ట్విట్ట‌ర్‌లో దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న జారీ చేసింది.

వ్యాక్సిన్ల ఉత్ప‌త్తిని వేగ‌వంతం చేయాలంటూ కేంద్ర ఆరోగ్య‌శాఖ సూచ‌న‌ను సీరం సంస్థ స్వాగ‌తించింది. రాష్ట్ర ప్ర‌భుత్వాలు, వ్యాక్సినేష‌న్ కేంద్రాలు, ప్రైవేటు హాస్పిట‌ళ్లు నేరుగా వ్యాక్సిన్ కోనుగోలు చేసుకునేందుకు వెస‌లుబాటు క‌ల్పిస్తున్న‌ట్లు సీరం సంస్థ చెప్పింది.


రానున్న రెండు నెల‌ల్లో కోవీషీల్డ్ టీకాల ఉత్ప‌త్తి సామ‌ర్థ్యాన్ని పెంచ‌నున్న‌ట్లు ఆధార్ పూనావాలా తెలిపారు. త‌మ ఉత్ప‌త్తిలో 50 శాతాన్ని కేంద్ర ప్ర‌భుత్వ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియకు అందిస్తామ‌ని, ఇక మిగితా 50 శాతం టీకాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు, ప్రైవేటు హాస్పిట‌ళ్ల‌కు అందివ్వ‌నున్న‌ట్లు ఆ ట్వీట్‌లో తెలిపారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అందుబాటులో ఉన్న విదేశీ టీకాల‌ను దృష్టిలో పెట్టుకుని, భారతీయుల‌కు ఆమోద‌యోగ్య‌మైన ధ‌ర‌లో టీకాల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌నున్న‌ట్లు పూనావాలా చెప్పారు.

ప్ర‌స్తుత మార్కెట్‌లో అమెరికా టీకాల ధ‌ర రూ.1500, ర‌ష్యా టీకాలు రూ.750, చైనా టీకాలు రూ.750గా ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. అయితే కోవీషీల్డ్ టీకాల‌ను ప్ర‌భుత్వానికి కేవ‌లం 400కే ఒక డోసును, ప్రైవేటు హాస్పిట‌ళ్ల‌కు 600కే ఒక డోసును అందివ్వ‌నున్న‌ట్లు తెలిపారు. మ‌రో నాలుగైదు నెల‌ల్లో రీటేల్ రంగంలోనూ టీకాల‌ను అమ్మ‌నున్న‌ట్లు సీరం సీఈవో వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.