Mandapeta: ఏపీలో దెబ్బతిన్న రహదారులను పునర్నిర్మించాలి.

మండపేట (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ లో రహదారులన్నీ అధ్వానంగా మారాయని.. పాడైపోయిన రోడ్లన్నీ పునర్నిర్మాణం చేపట్టాలని బీజేపీ యువమోర్చ జిల్లా కార్యదర్శి నాళం పణిప్రకాష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మండపేట తహసీల్దార్ టి రాజరాజేశ్వరరావుకు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కోన సత్యనారాయణతో కలిసి వినతి పత్రం అందజేశారు. కోన సత్యనారాయణ మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలు, నగరాలు ఇలా అన్నింటా రోడ్లు పరిస్థితి దారుణంగా వుందన్నారు. ధ్వంసం అయిన రోడ్ల వెంట ప్రయాణాలు చేస్తూ వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని అన్నారు. ఎక్కడ చూసినా రోడ్లు చిందరవందరగా గోతులమయంగా దర్శనమిస్తున్నాయని అన్నారు. వారి వారి గ్రామాల నుండి వేరే గ్రామాలకు ప్రయాణం చేయాలంటేనే ప్రజలు భయపడి పోతున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి పూర్తయినా ఎక్కడా రోడ్లుపై దృష్టి పెట్టలేదని అన్నారు. సర్కారు నవరత్నాల పేరిట పప్పు బెల్లాలు పంచుతూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎక్కడా మచ్చుకైనా కానరావడం లేదని ఆరోపించారు. రోడ్ల విషయానికి వస్తే మరీ దయనీయంగా వుందన్నారు. రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా పరిణమిస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరం అన్నారు. బీజేపీ తరపున అనేక మార్లు ఆందోళనా కార్యక్రమాలు, జిల్లా అధికారులను సైతం కలిసి విజ్ఞాపన పత్రాలను అందజేసిన చలనం లేదని దుయ్యబట్టారు. ప్రమాదాలకు నిలయాలుగా మారిన రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల మొర ఆలకించి స్పందిస్తే మంచిది అన్నారు. లేదంటే బీజేపీ తరపున రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు కూడా వెనకాడేది లేదని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో యువమోర్చ పట్టణ అధ్యక్షులు మారేటి రమణ, కార్యదర్శి బుద్దవరపు రాజు ,పోసాబత్తుల దుర్గా ప్రసాద్ , కోశాధికారి మొల్లేటి శివప్రసాద్ లు పాల్గొన్నారు.