Drug case: హాష్ ఆయిల్ స‌ర‌ఫ‌రా చేస్తున్న ల‌క్ష్మీప‌తి అరెస్టు

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలో డ్ర‌గ్స్ నియంత్ర‌ణ‌కు పోలీసులు డ్ర‌గ్స్ కేసుల ద‌ర్యాప్తును వేగ‌వంతం చేశారు. ఇటీవ‌ల డ్ర‌గ్స్‌కు బానిసై బిటెక్ విద్యార్ధి మృతి చెందిన కేసులో డ్ర‌గ్స్ విక్రేత ప్రేమ్ ఉపాధ్యాయ్‌తో పాటు మ‌రో మ‌గ్గురిని అరెస్టు చేసిన విష‌యం తెలిసిన‌దే. ప్రేమ్ ఉపాధ్యాయ్‌కి హాష్ ఆయిల్ (గంజాయి నుంచి తీసిన నూనె) స‌ర‌ఫ‌రా చేస్తున్న కీల‌క సూత్ర‌ధారి ల‌క్ష్మీప‌తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హాష్ ఆయిల్ ఎక్క‌డి నుండి తీసుకొస్తున్నారు? ఎవ‌రెవ‌రికి స‌ర‌ఫ‌రా చేస్తున్నార‌నే విష‌యాల‌ను నార్కొటిక్ విభాగం పోలీసులు సేక‌రిస్తున్నారు.

ల‌క్ష్మీప‌తి చ‌దువుకునే రోజుల్లోనే గంజాయికి బానిసై , త‌ర్వాత గంజాయిని విక్ర‌యించ‌డం మొద‌లు పెట్టాడు. సాప్ట్‌వేర్ ఇంజినీర్ల‌కు హాష్ ఆయిల్ స‌ర‌ఫ‌రా చేయ‌డం ప్రారంభించాడు. సుమారు 100మందికి పైగా హాష్ ఆయిల్ కొనుగోలు చేస్తున్న‌ట్లు స‌మాచారం.

ఐసో ప్రొఫైల్ ఆల్క‌హాల్‌లో గంజాయి మొగ్గ‌ల‌ను మ‌రిగించి దాని ద్వారా వ‌చ్చే ద్రావ‌ణాన్ని ల‌క్ష్మీప‌తి విక్ర‌యిస్తున్నాడు. లీట‌ర్ హాష్ ఆయిల్‌ను రూ. 6 ల‌క్ష‌ల వ‌ర‌కు విక్ర‌యిస్తున్నాడు. న‌గ‌రంలోని మాదాపూర్‌, కొండాపూర్‌, నార్సింగి, ప్రాంతాల్లో గ‌దులు అద్దెకు తీసుకొని, పార్టీలు ఏర్పాటు చేసి సాప్ట్‌వేర్ ఉద్యోగుల‌ను ఆహ్వానిస్తున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. ల‌క్ష్మీప‌తికి ఈ ఆయిల్‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్న ముఠాను గుర్తించేందుకు నార్కొటిక్ నియంత్ర‌ణ విభాగం పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.