GoodNews: 15 నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలోని అర్హులైన రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నిధులు జమ చేసేందుకు రాష్ట్ర సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల (జూన్) 15 నుంచి 25 వరకు రైతుల ఖాతాల్లో నిధులు జమచేయనున్నట్లు ఆయన చెప్పారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ ఏడాది రైతుబంధు పథకానికి 63.25 లక్షల మంది అర్హులైన రైతులను సర్కారు గుర్తించింది. ఈ మేరకు అర్హుల తుది జాబితాను సీసీఎల్ఏ వ్యవసాయశాఖకు అందజేసింది. రైతులకు చెందిన 150.18 లక్షల ఎకరాలకు సంబంధించిన రైతుబంధు సాయం అందించేందుకు రూ. 7508.78 కోట్లు అవసరమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈసారి కొత్తగా 66.311 ఎకరాలు ఈ పథకంలో చేరాయని.. అందుకు అనుగుణంగా 2.81 లక్షల మందికి రైతుబంధు పథకం వర్తింపజేశామని ఆయన వెల్లడించారు.
కాగా మొదటి సారి రైతుబంధుకు అర్హులైన రైతులు స్థానిక ఎఇఒలు, ఎఒలను కలిసి పట్టాదార్ పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా వివరాలను అందించాలని మంత్రి సూచించారు. బ్యాంకుల విలీనంతో ఐఎప్ ఎస్సి కోడ్లు మారిన ఖాతాదారులు ఆందోళన చెందొద్దని.. ఏమైనా సందేహాలుంటే స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదిస్తే నివృత్తి చేస్తారని తెలిపారు.