Mandapeta: సాయిబాబా ఆలయంలో వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు

మండపేట (CLiC2NEWS): గురు పౌర్ణమి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా మండపేటలోని సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడ గురుపౌర్ణమి వేడుకలు ఆలయ వ్యవస్థాపకులు కాసా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో శనివారం వైభవంగా జరిగాయి. స్థానిక తరవాణి పేట వీధిలో కొలువు తీరిన సాయినాథుడు ప్రత్యేక అలంకరణలతో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ పూజారి ఆనంద్ స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అభిషేకం అయిన అనంతరం బాబాను పట్టు వస్త్రాలతో అలంకరించారు. గురు పౌర్ణమి ఎంతో పవిత్రమైన రోజు కావడంతో స్వామిని దర్శించుకోవడానికి భక్తులు తరలి వచ్చి సాయినాథున్ని ఆరాధించారు. అర్చకులు ఆనంద్ గురు పౌర్ణమి హిందూ సంప్రదాయ పండుగలలో ఒకటి అన్నారు. గురుపౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉందని వివరించారు. కమిటీ సభ్యులు గుండు తాతరాజు, పసుపులేటి వెంకట్రావు, ప్రసాద్, కోన సత్యనారాయణ ఏర్పాట్లు చేశారు.