నేడు, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు..వాతావరణ కేంద్రం హెచ్చరిక
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రానికి మరోసారి వర్షాల ముప్పు ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలోని అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. శనివారం అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆగస్టు 7 నుండి 9 మధ్య అతి భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్లు ఎత్తు వరకు వ్యాపించి ఉంది. విదర్భ నుండి తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిలో మీటర్లు ఎత్తున ద్రోణి కొనసాగుతుంది. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, .జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్త గూడెం జిల్లాల్లో కుంభవృష్టికి అవకాశాలు ఉన్నట్లు వాతావరణ కేంద్రం అంచనా వేసింది.