High court: దేవరాయాంజల్‌ భూములను సర్వే చేయొచ్చు: హైకోర్టు

హైదరాబాద్‌ (CLiC2NEWS): దేవరాయాంజల్‌ భూములను ప్రభుత్వం నిరభ్యంతరంగా సర్వే చేయొచ్చని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. భూములపై విచారణ చేసే స్వేచ్ఛ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దేవరయాంజల్ భూముల సర్వేపై ఐఏఎస్​ల కమిటీ ఏర్పాటు జివొను కొట్టేయాల‌ని కోరుతూ సదాకేశవరెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. జివొ 1014 అమలు నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఆలయ భూముల గుర్తింపునకు విచారణ నిర్వ‌హిస్తే ఇబ్బందేమిటని ప్రశ్నించింది. ప్రభుత్వ, ఆలయ భూములను గుర్తించకూడదా? అని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. కబ్జాదారులను ఆక్రమణలు చేసుకోనీయాలా అన్న హైకోర్టు.. విచారణ జరిపి నివేదిక ఇవ్వడం కమిటీ బాధ్యతని పేర్కొంది. నోటీసులు ఇవ్వకుండా భూముల్లోకి వస్తున్నారన్న పిటిషనర్‌ వాదనను పరిగణనలోకి తీసుకుంటూ భూముల్లోకి వెళ్లేముందు పిటిషనర్లకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. పిటిషనర్లపై వ్యతిరేక చర్యలు తీసుకుంటే ముందస్తు నోటీసులు ఇవ్వాలని సూచించింది. కమిటీకి అవసరమైన దస్త్రాలు, సమాచారం ఇవ్వాలని పిటిషనర్లను ఆదేశించింది. పిటిషనర్లు సహకరించకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Leave A Reply

Your email address will not be published.