గణేష్ ఉత్సవాలు, నిమజ్జనంపై హైకోర్టు కీలక ఆదేశాలు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో గణేష్ ఉత్సవాలు, నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు విధించింది. హుస్సేన్ సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని కోర్టు స్పష్టం చేసింది. గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనంపై ఆంక్షలు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి గురువారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ప్రత్యేక కుంట్లలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయాలని హైకోర్టు సూచించింది. హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం, జిహెచ్ ఎంసి, పోలీసులు అమలు చేయాలని ఆదేశించింది.
హుస్సేన్‌సాగర్‌లో గణ్‌శ్, దుర్గాదేవి విగ్రహాలు నిమజ్జనం చేయకుండా తగిన ఆదేశాలు జారీ చేయాలంటూ గతంలో న్యాయవాది మామిడి వేణుమాధవ్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం ఇటీవ సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. దీనిపై వాదనలు మిగియడంతో తీర్పును రిజర్వు చేసిన హైకోర్టు.. తాజాగా తీర్పును వెలువరించింది.
హుస్సేన్‌సాగర్‌లో ట్యాంక్‌బండ్ వైపు నిమజ్జనానికి అనుమతించొద్దని హైకోర్టు పేర్కొంది. హుస్సేన్‌సాగర్‌లో ప్రత్యేకంగా రబ్బరు డ్యాం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. చిన్న, పర్యావరణహిత విగ్రహాలను ప్రోత్సహించాలని ధర్మాసనం పేర్కొంది. పివీ మార్గ్, నెక్లెస్ రోడ్డు, సంజీవయ్య పార్కు రోడ్డు తదితర ప్రాంతాల్లో చేసుకోవచ్చిని తెలిపింది. నిమజ్జనం తర్వాత అక్కడి వ్యర్థాలను పూర్తిగా తొలగించాలని స్పష్టం చేసింది. అలాగే రోడ్లపై ఆటంకం కలిగించేలా మండపాలు ఉండరాదని చెప్పింది. సాంస్కృతిక కార్యకలాపాలు నియంత్రణలో ఉండేలా చూడాలని ప్రభుత్వానకి సూచించింది. రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి ధ్వని కాలుష్యం రాకుండా చూడాలని హైకోర్టు స్పష్టం చేసింది.