పుట్టిన ఊరు, కన్నతల్లి, మాతృభాషను ఎన్నటికి మరిచిపోలేము..

విజయవాడ (CLiC2NEWS): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శుక్రవారం స్వగ్రామమైన కృష్ణా జిల్లా పొన్నవరం చేరుకున్నారు. ఎన్వి రమణ తొలిసారి సిజెఐ హోదాలో పొన్నవరం వచ్చారు. దీంతో అధికారులు, గ్రామస్థులంతా పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. సిజెఐ పొన్నవరంలో గ్రామస్థులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ.. పొన్నవరంతో తనకు ప్రత్యేక అనుంబంధముందన్నారు. చిన్నప్పుడు ఉపాధ్యాయులు తనను ఎంతో ప్రేమగా చేసేవారని గుర్తుచేసుకున్నారు. అన్ని సమస్యల పరిష్కారానికి ఐకమత్యమే ఔషధమని, తెలుగు వారి గొప్పదనాన్ని మరింత పెంచేలా మనం ప్రవర్తించాలని జస్టిస్ ఎన్విరమణ సూచిందారు.
ఢిల్లీలో తెలుగు వారి గొప్పదనం గురించి అనేక మంది చెబుతారని,. అక్కడి ప్రముఖ కట్టడాలను తెలుగువాళ్లే నిర్మించారని చెపుతుంటారని జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. కరోనా కష్ట కాలంలో వ్యాక్సిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ సిఎండి డాక్టర్ కృష్ణ ఎల్లా, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా తెలుగు వారు కావడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. తెలుగువాడిగా బారతదేశ అత్యున్నత న్యాయస్థానంలో తాను ఉన్నానంటే ప్రజలందరి అభిమానం, ఆశీస్సులతోనేనని చెప్పారు. ఎంత ఎదిగినా మాతృభూమిని మర్చిపోలేదన్నారు. తెలుగు ప్రజలు గర్వపడేలా, తెలుగు జాతి కీర్తిని, చాటిచెప్పేలా ప్రవర్తిస్తానన్నారు.