విజయుడు (ధారావాహిక నవల పార్ట్-22)

తెల్లారి లేవగానే విరంచి గుర్తుకు వచ్చి హుషారు అనిపించింది విజయ్‌కు.ఈ రోజు విరంచితో మరోసారి కలువబోతున్నాడు. ఆమె చేతి కాఫీ తాగబోతున్నాడు. రాత్రి ఢిన్నర్ కూడా ఆమెతోనే అది కూడా వాళ్ల ఇంట్లో కాదు, హోటల్‌లో, నాకారులో మొదటి సారి విరంచి కూర్చోబోతున్నది. తలుచుకుంటే విజయ్ మనస్సు గాలిలో తేలిపోతున్నది. తాను ఎంఎల్‌ఎ నని, బాధ్యతగా ఉండాలనే భావన ఎప్పుడో కొట్టుకుపోయాయి, ఒక యువకునిలో వచ్చే ఆలోచనలు డామినేట్ చేస్తున్నాయి. ఆ రోజు ఏమి కార్యక్రమాలు పెట్టుకోకుండా విశ్రాంతిగానే ఉండాలని నిర్ణయించుకున్నాడు విజయ్. ఎందుకో విజయ్ కలవరపాటుకు గురవుతున్నాడు. ఎంతో విద్యావంతురాలు, తనంటే గౌరవ, మర్యాదలు చూపే విరంచి అంటే ఆయనకు రోజురోజుకు అభిమానం పెరుగుతున్నది. ఆమె అందాన్ని చూసి ఆకర్షితుడయ్యాడా, ఇతర కారణాలేమిటో విజయ్‌కు కూడా అంతుబట్టలేదు. ఈ పరిచయం ఎటు దారితీస్తుందో చూద్దామంటూ చర్చించుకున్నాడు. లంచ్‌చేసి ఒక కునుకు తీసిన విజయ్‌కు సాయంత్రం పిఎ ఫోన్‌తో మెలుకవచ్చింది.
సార్ మిమ్ములను కలవడానికి ఒకరు ఫోన్ చేశారు. మీరు నిద్రలో ఉన్నందున డిస్టర్బ్ చేయలేదు. రమ్మని చెప్పమంటారా అంటూ పిఎ ప్రశ్నించారు.
లేదు నగేష్, నాకు వేరే పని ఉంది, నెంబర్ నోట్ చేసుకో, తర్వాత టైం చెబుదామని, నీవు కూడా వెళ్లిపో ఈ రోజు వేరే పనేమి లేదని ఫోన్ కట్ చేశాడు.
సాయంత్రం కావడంతో తొందరగా తెమిలి విరంచి ఇంటికి వెళ్లేందుకు రఢీ అవుతుండగా మరోసారి సెల్‌ఫోన్ రింగ్ అయింది. అవతలి వైపు నుంచి అదే తియ్యటి గొంతు వినిపించడంతో ఆ అనంధాన్ని ఆస్వాధిస్తూనే హలో అన్నాడు. ఏమీ లేదండీ.. బయలు దేరారా లేదా అని కాల్ చేశానని విరంచి చెప్పింది.
మరో అయిదు నిమిషాల్లో కారులో కూర్చుంటాను, సాయంత్రం కదా ట్రాఫిక్ రద్దీ అధికంగా లేకపోతే అరగంటలోపుగానే మీ ఇంటికి చేరుకుంటాని విజయ్ చెప్పడంతో జాగ్రత్త అంటూ విరంచి కాల్ కట్ చేసింది. ఎన్నడూ లేనిది ఈల వేస్తూ కిందికి దిగి కారు స్టార్ట్ చేశాడు..
కుటుంబరావు ఇంటికి కారు చేరడంతో ఓపెన్ చేసి ఉన్న గేటునుంచి నేరుగా పోర్టికో వరకు కారును తీసుకుపోయి ఆపాడు. కారు సౌండ్ విని బయటకు వచ్చిన విరంచిలో కొత్త ఆనందం కనిపించింది విజయ్‌కు. కారు దిగుతూనే ఆమెను విష్ చేస్తూ ముందుకు కదిలాడు. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ హాల్‌కు చెరుకొని సోఫాలో కూర్చున్నారు.అప్పటినుంచి విరంచి ఏదో మాట్లాడుతూనే ఉంది ఇద్దరు కలిసి హాల్ లో కూర్చున్నారు.
ఇదేమిటీ నేను ఇంతసేపు మాట్లాడుతున్నా..మీరు చూస్తూ ఉన్నారు తప్ప ఏమి చెప్పడంలేదు, చిరుకోపంతో అంది విరంచి.
గుండె గొంతుక లోన కొట్టాడుతుంది,కూసిండనీదురా …నండూరి ఎంకి గుర్తుకు వచ్చింది మరి,అంటూ చిరు మందహాసంతో బదులిచ్చాడు విజయ్. దీంతో చనువుగా విజయ్ భుజంపై ఒక్కటిచ్చేలా చెయ్యి లేపింది. అంతలో
అమ్మాయి కాఫీ తీసుకు పోదువుగానీ రా అంటూ తల్లీ పిలవడంతో దిగ్గున లేచి వంటగదిలోకి వెళ్లింది విరంచి.
విజయ్‌కు ఒక కప్పు ఇచ్చి, తానొకటి తీసుకొని పక్కపక్కనే కూర్చున్న వారిద్దరిని చూసి , చూడ చక్కని జంట, వారి మనస్సులో ఏముందో కానీ ఒకరి కోసం ఒకరు పుట్టినట్లున్నారు. దేవుడు ఎలా రాసిపెట్టి ఉన్నాడో అనుకుంటూ తల్లి లోపలికి వెళ్లింది.
కాఫీ తాగుతూ వారు కబుర్లలో పడిపోయారు. సినిమాల ట్రెండ్, నటుల ప్రవర్తనల విషయం వారి మధ్య చర్చకు వచ్చింది.
ప్రేక్షక దేవుళ్లు అంటూ వారిని ఎంతో గౌరవించే విధంగా నటులందరూ బాగానే మాట్లాడుతూ ఉంటారు,కానీ వారిదంతా వ్యాపారమే. కోట్లు తీసుకుంటారు. బ్లాక్‌లోనే ఎక్కువగా రాబడుతారు. ఆ సీనియర్ నటుడు అయితేనే కాసుల వర్షం కురుస్తుందని నిర్మాతలు ఎగబడతారు. కథను నమ్ముకోవడం కంటే నటుని గ్లామర్‌కే ఆయన అభిమానుల సంఖ్యను ప్రాధాన్యతనిస్తున్నారు, దర్శకుడు ఎంతచెబితే అంతే నిర్మాతకు. హిట్టు అయిన ఓ సినిమాలో హీరో ప్రవేశం వెరైటీగా ఉండాలని ఆ హీరో పాదాలను ముందుగా చూపుతాడు ఆషాట్‌లో. ఆయన కాలు గుడ్రంగా తిప్పితే సుడిగాలి లేసినట్లుగా షాట్. ఇదిఎలా సంభవమో వాస్తవానికి ఎంత దూరంగా ఉంటుందో ఆ డైరెక్టర్‌కు పట్టదు. సరికొత్త స్టయిల్‌లో హీరోను చూపామా లేదా అనేది ఆయనకు కావాలి. పైగా తెరమీద హీరో కాలు ముందుగా చూపడం ఏమిటో? పాద దర్శనం కాబోలు. దానికే థియేటర్‌లో అభిమానానుల ఈలు, కేరింతలు. గుడ్డిగా అభిమానించే వారికి ఓకే. ఇతరులు ఏమి కావాలి? వారు ఎలా భరిస్తారు. ఇలాంటి సీన్లు. సినిమాల ప్రదర్శన కేవలం అభిమానులేక పరిమితం అయితే ఈ హీరో సినిమాలన్నీ హిట్ కావాలి కానీ ఎక్కువ ఫట్ అయ్యాయి. భయ్యర్స్ మునిగిపోయారు. అన్నాడు విజయ్.
అవునండీ ఆ సినిమా నేనూ చూశాను. మూడ నమ్మకాలను ప్రోత్సహించేలా, దయ్యం ఆవహించి డాన్స్ చేయడం ఏమిటో…జనం వినోధం కోసం థియేటర్లకు వస్తే…వారి జేబులు ఖాళీ చేసి సొమ్ము చేసుకునే క్ష్యం తప్ప ఇందులో మరింకేమి కనిపించదు. ఇదే సినిమా నాలుగైదు భాషల్లో రిమేక్ అయి బాగా వసూలు చేసినట్లు ఉంది కదూ అంది విరంచి.
ఎక్కువ సినిమాలు నేల విడిచి సాము చేసినవే. తెలుగులో కథలు దొరకడం లేదని, ఇతర భాషా చిత్రల హక్కులను కొనుగోలు చేసి, రీమేక్‌లు చేస్తున్నారు. అయినా అందరికీ తక్కువ ఖర్చుతో వినోధం పంచేది మాత్రం సినిమాలే కదా. అందుకే మనం వాటిలోని మంచిచెడ్డలపై ఎక్కువ మాట్లాడుకోకవడం మంచిది లెండీ. ప్రజలను బాగు చేయాలనే ఉద్ధేశ్యంతో సినిమాలు తీయాలని ఎవరూ ఈ కాలంలో భావించరు. వంద రూపాయలు ఖర్చు చేస్తే 150 అయినా రాబట్టాలనేది నిర్మాతల భావన. వ్యాపారాత్మకమైనప్పుడు ఎవరిని తప్పు పట్ట కూడదు. పైగా ఈ రంగంలో ఎందరికో ఉపాధి లభిస్తున్నదని విజయ్ అన్నారు.
—
బాగుంది, అంతా మీరే అంటున్నారు. కానీ కొంత వాస్తవికతను ప్రతిభింబించాలని కోరుకుంటున్న వారున్నారు. అలా చేస్తే వారు దివాలా తీస్తే ఆదుకునే వారెవరనే ప్రశ్న ముందుకు వస్తుంది. మన దేశంలోనే కాదు అన్ని దేశాల్లో ఇదే పరిస్థితి అనుకుంటా అంటూ విజయ్ వైపు చూసింది విరంచి.
సరేకానీ నీ పిహెచ్‌డి ఎంతవరకు వచ్చింది. అసలు మీ సబ్జెక్టు ఏమిటో చెప్పనే లేదు.
మీరు ఇంతవరకు అడగలేదు, నేను చెప్పలేదు. ప్రశ్నకు ప్రశ్నతోనే సమాధానం చెప్పింది విరంచి.
ఇప్పుడు అడుగుతున్నాను కదా చెప్పండి.
నా థీసిస్ కూడా కొంత ప్రజోపయోగంగా ఉంటే మంచిదని ఈ దృక్కోణంలో సబ్జెక్టును ఎన్నుకున్నాను. మా గైడ్‌కు కూడా ఇది నచ్చ లేదు. ఏ ప్రబంధాలపైనో, ఇతి హాసంలోని పాత్రలపైనో, ఆధునిక కవిత్వంపైనో, విప్లవ కవిత్వంపైనో ఎక్కువ మంది పిహెచ్‌డిలకు ముందుకు వస్తున్నారు. కానీ నేను అట్టడుగు వర్గాల ప్రజల కోసం అని గొప్పలు చెప్పడం కాదు కానీ బడుగు, బలహీన వర్గాలు, దళితుల సమస్యలను వెల్లడించేలా నా సిద్ధాంత వ్యాసం ఉండాలని నిర్ణయించుకొని, మీలాంటి ప్రముఖులతోనూ సంప్రదించి…సోషల్ జస్టిస్…సామాజిక సమస్యల పరిష్కారంలో పాలకుల పాత్ర అనే సబ్జెక్టును ఎంపిక చేసుకున్నాను. అనుకున్నట్లుగానే నా గైడ్‌నుంచి ఆశించిన మేరకు సలహాలు అందడం లేదు. నేనే లైబ్రరీలకు వెళ్లి వార్తా పత్రికలు, వ్యాసాలు చదివి సేకరించిన సమాచారంతో రాస్తున్నాను. ఇంకా చేయాల్సింది చాలానే ఉందని విజయ్‌కు వివరించింది.
బాగానే ఉంది మీ ఆలోచన.కానీ లైబ్రరీలు, పత్రికలేక పరిమితమైతే మీ సిద్దాంత వ్యాసంలో వాస్తవికత అనుకున్నంతగా ప్రతిభింబించకపోవచ్చు. జనంలోకి వెళ్లండి. గిరిజన ప్రాంతాల్లో పర్యటించాలి. హరిజన వాడల్లోకి వెళ్లి ప్రత్యక్షంగా వారి ఈతి బాధలు తెలుసుకోండి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రజాసమస్యలపై జరిగే చర్చలను చూసి నోట్ చేసుకోండి. కాలేజీలకు వెళ్లండి. పరీక్ష ఫీజులు కూడా సకాలంలో చెల్లించలేక స్కూల్ యాజమాన్యం ఈసడింపులు భరించే విద్యార్థుల ఆగచాట్లు తెలుసుకోండి. అంటూ మార్గదర్శనం చేస్తున్న విజయ్‌లో ఆమెకు గురువు దర్శనమిచ్చినట్లు అయింది. ఒకేసారి రెండు చేతులు జోడించి
విజయ్‌ను చూస్తూ ఏదో కొత్తగా జ్ఞానోధయం అయినట్లుగా చూస్తూ ఉండిపోయింది. ఈ సమయంలోనే తండ్రి కుటుంబరావు హాల్‌లోకి వచ్చాడు. భక్తిభావంతో ముకిలిత హస్తాలతో ఉన్న విరంచి ఆయనకు కొత్తగా కనిపించింది. ఎందుకలా తన కూతురు ఉందో ఆయనకు తెలియలేదు.
ఏమిటమ్మా, విజయ్ పట్ల అధిక గౌరవం చూపిస్తున్నావంటూ తండ్రి మాట్లాడటంతో విరంచికి వెంటనే ఏమి చెప్పాలో పాలుపోలేదు,
ఇప్పుడే వస్తున్నారా సార్, అంటూ విజయ్ లేచి నిలబడి నమస్కారం చేశారు.
అవును కాలేజీలో కొంత ఆలస్యం అయింది. అంటూ సోఫాలో కూర్చున్నాడు. ఏమి లేదు డాడీ, నా పిహెచ్‌డి సిద్ధాంత వ్యాసంపై మేం ఇప్పుడు చర్చించుకుంటున్నాం. మా గైడ్ కూడా ఇప్పటివరకు చెప్పని పలు అంశాలను విజయ్ వివరించారు.
అవునూ…కనీసం మీ నాన్న కాలేజీకి వెళ్లారా? మీ పరిశోధన అశం దృష్టిలో పెట్టుకొని కాలేజీలోని నిమ్న వర్గాలకు చెందిన విద్యార్థుల పరిస్థితిని పరిశీలించే ప్రయత్నం చేశారా? ఈ విధంగా విజయ్ అడగంతో తెల్లబోయింది విరంచి. ఇలాంటి ఆలోచన కూడా తనకు ఇంతవరకు రానందుకు సిగ్గుపడింది. మానాన్న కాలేజీకి నా ఎంఎ పూర్తి అయిన తర్వాతినాటి నుంచి ఇప్పటివరకు వెళ్లలేదని చెప్పింది. మీరు చెప్పిన దృక్కోణం నా తలంపుకే రాలేదని, ఇక నుంచి కొత్త కోణంలో పరిశీలన చేస్తానని నిజాయితీగా చెబుతున్నానని విరంచి తలవంచుకుంది.
మీరు ముఖ్యమైన, సబ్‌జెక్టుపై చాలా గంభీరంగా మాట్లాడుకుంటున్నారు. కానీయండి నేను స్నానం చేసి, పది నిమిషాల్లో రఢీ అవుతాను, బయలు దేరుదాం అంటూ కుటుంబరావు లోనికి వెళ్లాడు.
మహాకవి శ్రీ శ్రీ కవితలు ఎలాగూ చదివి ఉంటారు. చేగువేరా గురించి చదివారా? సామ్రాజ్యవాదంపై పిడికిలెత్తి పోరాడిని వీర యోధుడు. ఆయన జీవిత చరిత్రను చదవండి.. ఎర్నెస్టో చే గువేరా అంతర్జాతీయ వాది.గొప్ప మానవతావాది. చే జీవితం అంటేనే సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం.క్యూబా విప్లవోధ్య నేత.192 లో జన్మించారాయన. అస్తమా పేషంట్ అయిన చే డాక్టర్ కావాలనుకున్నారు. కానీ అమెరికా దౌష్ట్యాలను ఎదురించేందుకు విప్లవోధ్యమ బాటపట్టారు. యువతకు ఆయన ఆదర్శప్రాయుడు. గుర్రం జాషువా, చెరబండ రాజు,వంటి అనేక మంది మనకు ఎంతో సాహిత్యాన్ని ఇచ్చారు. విప్లవ సాహిత్యం కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. సిరిసిల్ల,జగిత్యాల నక్సల్స్ ఉద్యమం, రైతాంగ పోరాటాలు బస్తర్, శ్రీకాకుళం ప్రాంతాల్లో తీవ్రవాద ఉద్యమం ఎందుకు వచ్చింది. ఎందుకు దీర్ఘకాలం కొనసాగుతున్నదో తెలుసుకుంటే మీ థీసిస్ రాయడానికి ఎంతో ఉపకరించడంతోపాటు మీ పిహెచ్‌డి పరిశోధనకు అవసరమైనా పరిపక్వత మీకు ఒనగూడుతుంది.
విజయ్ చెబుతున్న విషయాలు చాలా వరకు ఆమెకు తెలియదు. అందుకే ఆయన చెబుతున్న వివరాలను జాగ్రత్తగా వింటున్నది విరంచి.
అందరికీ అన్ని తెలియాలని లేదు, ఇందులో మీరంతగా బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. మీరు ఎంచుకున్న అంశం చాలా ప్రాధాన్యత కలది. అలాంటప్పుడు కొంత ప్రాక్టికల్ పరిశోధన ఉంటే బాగుంటుందని మాత్రమే నేను సలహా ఇస్తున్నాను. నిర్ణయం మీదే. నాకు లిట్రేచర్‌తో కొంత పరిచయం ఉన్న దృష్ట్యా ఈ దృక్కోణం నుంచి పరిశీలించి రాస్తే అది మరింత సమగ్రంగా ఉంటుందనే ఆలోచన చేశాను. ఇందులో మీకు ఎలాంటి అనుమానాలున్నా, నాకు తోచిన సూచనలు ఇస్తాను. జనం దగ్గరికే వెళ్లాలని భావిస్తే నేను అన్ని విదాలుగా సహకరిస్తానని విజయ్ చెప్పగానే థాక్స్, చాలా థాక్స్ అంటూ విజయ్ చేతులు పట్టుకొని షేక్‌హ్యాండ్ ఇచ్చింది.
మరి అంత ఉద్వేగానికి ఎందుకు గురి అవుతున్నారు. రోజూ పత్రికలు చదివే సమయంలోనూ మీ యాంగిల్ మారాలి. సమస్యలేమిటో ప్రత్యేకంగా క్రోఢీకరించే విధంగా చూడాలి. వాటిని ఒకదగ్గర నోట్‌చేసుకోండి. గ్రంథ రచనలో ఉపయోగపడుతాయి. ఇదే విషయం ఎక్కువ సేపు మాట్లాడితే మీకు.నాకు కూడా బోర్ కొడుతుంది. ఇతర విషయాలు చెప్పండి, కొత్త సినిమాలు ఏవైనా చూశారా? అంటూ టాపిక్ డైవర్టు చేశాడు విజయ్.
లేదండి, సినిమాలు ఎక్కువగా చూడను. ఎప్పుడైనా అమ్మ చూద్దామంటే ఒక్కదాన్ని పంపకుండా నేను తోడు వెళ్తుంటాను అంతే. కొంత బాగా ఉన్నాయని టాక్ వచ్చిన సినిమాలకు పోదామని అమ్మ పోరుపెడితే తప్పడం లేదు నాకు. అంది విరంచి. ఈ లోగా రఢీ అయి వచ్చాడు కుటుంబరావు. అమ్మ నీవు రఢీనా అంటూ విరంచిని అడగడంతో ఒక్క నిమిషం డాడీ అంటూ లోనికి వెళ్లి కాస్తా టచప్ చేసకొని తన మేకప్ అయిపోందనిపించుకొని హాల్‌లోకి వచ్చింది విరంచి. అమ్మనుకూడా తీసుకు వస్తానని చెప్పి లోపలికి వెళ్లి వెంటనే తల్లితోపాటు తిరిగి వచ్చి మేం రఢీ బయలు దేరుదాం అంది.
విరంచిని కారులో ముందు సీటులో కూర్చోబెట్టు కోవాలనే ఆలోచన వచ్చింది విజయ్‌కు. విరంచి, వాళ్ల అమ్మ వెనుక సీట్లో తాను డ్రైవింగ్ సీట్లో, కోటేశ్వర రావు తన పక్క సీట్లో కూర్చునే అవకాశం ఉందని అంచనా వేసిన విజయ్ చిన్న ఉపాయం వేసుకున్నారు. తాళం వేసి తల్లి, విరంచి బయలు దేరగా కోటేశ్వర రావు,విజయ్‌తో ముచ్చటిస్తూ కొంత ముందుగా నడుస్తున్నారు. తన డ్రైవర్‌ను పిలవగా వద్దులెండి నా కారులోనే నలుగురం వెల్దాం. డ్రైవర్ అంటే అయిదుగురం అంత ఫ్రీ గా కూర్చోలేం. అంటూ తన కారు వద్దకు తీసుకువెళ్లి వెనుక సీటు డోర్ తీసి కోటేశ్వర రావును కూర్చోబెట్టి తాను డ్రైవర్ సీట్ వైపు వెనుకనుంచి కదులుతూ..విరంచి మదర్‌ను కూడా వెనుక సీట్లో భర్త పక్కన కూర్చోబెట్టాడు. విరంచి ముందు సీట్లో కూర్చోనాల్సిన పరిస్థితి కల్పించారు. ఇదంతా గమనిస్తున్న విరంచి ఏదైనా మాట్లాడితే బాగుండదని వచ్చి విజయ్ పక్కన కూర్చొంది. కారు స్టార్ట్ చేసిన విజయ్‌తో …మనకు దగ్గరలోనే మంచి ెటళ్లు చాలానే ఉన్నాయి, ఎక్కడికి వెల్దాం అంటూ కోటేశ్వర రావు ప్రశ్నించగా, మీ ఇష్టం అని తల్లీ, కూతురు అన్నారు. అయితే విజయ్ మాత్రం మన ఫ్రండ్ ఉన్నాడుగా భుజంగ రావు , ఆయనది స్టార్ హోటల్ కదూ, దర్జాగా అందులో భోజనం చేద్దాం, ఏమంటారన్నట్లుగా కారు నడుపుతూనే వెనుకకు తలతిప్పి, కోటేశ్వర రావు అభిప్రాయం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఎందుకో కానీ ఆ ెటల్ అనగానే కోటేశ్వర రావు ముఖంలో రంగులు మారాయి. వద్దని వారించలేకపోతున్న ఆయన ముఖ కవలికలను గమనిస్తూ, కారణాలు ఏమైనా చెబుతాడా అని ఎదురు చూస్తున్నాడు విజయ్.
(సశేషం)