అసెంబ్లీకి వెళ్లని వారు రాజీనామా చేయాల్సిందే: షర్మిల
మచిలీపట్నం (CLiC2NEWS): అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే పదవుల్లో ఎందుకు ఉండటమని పిసిసి అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. ఎపిలో ఈ నెల 11 నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు హాజరుకావడం లేదని వైఎస్ ఆర్ పార్టి అధినేత జగన్ ప్రకటించారు. ఈ క్రమంలో షర్మిల స్పందిస్తూ.. అసెంబ్లీకి వెళ్లని వారు ఎవరైనా రాజీనామా చేయాల్సిందేనని అన్నారు. మచిలీపట్నంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
ఎపి అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ ఆర్సిపికి 11 సీట్లు వచ్చాయి. తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీకి వెళ్లి ఏం మాట్లాడగలం అని జగన్ మాట్లాడిన విషయం తెలిసిందే. అసెంబ్లీకి వెళ్లక పోయినా .. రాష్ట్ర ప్రభుత్వాన్ని మీడియా సమావేశాల ద్వారా ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ఈ విషయంలో జగన్ తీరుపై షర్మిల తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీకి వెళ్లని వారు జగన్ అయినా సరే, వైఎస్ ఆర్ సిపి ఎమ్మెల్యేలైనా రాజీనామా చేయాల్సిందేనని అన్నారు.