Interview: బహుముఖ ప్రజ్ఞ `శిఖపింఛమౌళి`
సినీ గేయ రచయిత అక్కల చంద్రమౌళితో ప్రత్యేక ఇంటర్వ్యూ..

“సమాజానికి సాహిత్యం అద్దంలాంటిది”-గోర్కీ పాట అంటె అతనికి ప్రాణం. రచయిత రాయనీ రోజు ఉంటుందేమో కానీ మనసులో ఆలోచించని రోజు ఉండదు. ఆయన పాట రాయని రోజు మనసు కకాలవికలమే. తన స్థల, కాలపు మనుషులు, రీతిరివాజులు, కట్ఠుబొట్టు కలానికి బాగా తెలుసు.ఆదివాసుల జీవితాలు, హైదరాబాద్ సిటిలైఫ్ పోకడలు ఆయనకు బహుబాగా పరిచయమే.
సింగరేణి బొగ్గుగుట్టల్లో తోవలో మండే నిప్పురవ్వ అతని అక్షరం. గోదావరిలోయ ప్రతిపాయలోని అడవి ప్రాంతాల్లోని మోదుగుపూల పరిమళం ,ఇప్పచెట్టు పూలవాసన తీరుగా అతని సాహిత్యం.
నల్లరేగడి మట్టిలోని నాగేటి సాల్లలో ఆకుపచ్చ నవ్వుల వరిపైరు మాట్లాడే భాష ఆయన చేతిరాతలు. నాగోబా జాతర మేస్రం జాతి రీతి రివాజుల అక్షరగానం .తన ప్రతిభతో యావత్ దునియానే పాట పక్షిలా తిరుగుతున్నాడు. అంతర్జాతీయ, జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ తన కలానికి స్క్రీనింగ్ కొత్తెంకాదు. అనేక ప్రశంసలు, అవార్డులు అందుకొని మహామహుల చేత శభాష్ అనిపించుకుంటున్న సినిమా గీత రచయిత, కథకుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్న అక్కల చంద్రమౌళితో CLiC2NEWS ప్రత్యేక ఇంటర్వ్యూ..
CLiC2NEWS: మీ కుటుంబ నేపథ్యం గురించి..
మౌళి: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రామక్రిష్ణపూర్, తండ్రి అక్కల లచ్చన్న, సింగరేణి కార్మికుడు, తల్లి రాజేశ్వరి, గ్రృహిణి. ఇద్దరు అన్నయ్యలు. నేను చిన్నవాడిని. సొంతూరిలోనే పాఠశాల సి.వి.రామన్ ఉన్నత పాఠశాల చదివాను. ఇంటర్ క్రాంతి కాలేజి, డిగ్రీ మరియు ఎం.సి.ఏ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పూర్తిచేశాను.
ప్రస్తుతం సినిమా గేయరచయితగా పాటలు రాస్తున్నాను.

CLiC2NEWS: సాహిత్యం పట్ల సోయి ఎలా కలిగింది?
మౌళి: గోదావరి తీర ప్రాంతంలోని సింగరేణి బొగ్గు ప్రాంతం. మధ్యతరగతి కార్మికులు నివాసం ఉండేచోటు. మధ్యతరగతి జీవితాలు, పేద కార్మికుల గుడిసెల కరెంట్, నీరు తాగడానికి దొరకని పరిస్థితులు ఉండే చోటు మాది.
మనసు రందిగున్నపుడు పుస్తకాలు చదవాలని ఉండేది. అప్పట్ల మాకేమి గ్రంధాలయ సౌలత్ లేవు. అందువల్ల ఆకడమిక్ తెలుగు పాఠ్యపుస్తకాల్లోని గద్యభాగం, పద్యభాగం కంఠస్తం చేసేవాడిని. రచయితల గురించి టీచర్ అడిగి తెలుసుకోనేవాడిని. ఏకాసంతాగ్రహిని
రోజులో పాటలు రేడియోలో వందలసార్లు శ్రద్ధగా వినడమే కాకుండా సాహిత్యం గురించి తెలుసుకోవాలనే తండ్లాట ఉండేది. అది రాయడం ఎలాగో అన్న ప్రశ్న కూసోనియ్యదు నిలుసోనియ్యదు.
నేనేదో కాకిరిబికిరి పాటలు అల్లెటోణ్ణి. నాలుగో తరగతిలో “ఒకే కులం, ఒకేమతం ఆందరూ ఒకటె అందరిని కనే శక్తి అమ్మ ఒక్కతే“ అది పాటని నాక్కూడా తెలియదు. పాఠశాల కల్చరల్ కార్యక్రమంలో బలిమిటికి ధైర్నం తెచ్చుకోని పాడాను. మొదటి బహుమతి వచ్చింది. అట్లనే గణేష్ నవరాత్రుల పండుగల్లో పాట పాడితే వందరుపాయలు ఇచ్చి సన్మానం చేశారు. అప్పటినుంచి పదోతరగతి వచ్చేసరికి ఐదువందలు పాటలు రాసిపెట్టుకున్నాను
CLiC2NEWS: మీ పాటల గురించి చెబుతారా?
మౌళి: పదేండ్ల నుంచే పాటలు రాసేవాణ్ణి వాటికి బాణీలు కట్టి పాడేటోణ్ణి. అట్లా చదువు అయిపోయిన తర్వాత సినిమా పాటలు ప్రయత్నం చేశాను. రెండు మూడేండ్లు స్టూడియోలో కెళ్ళి వినిపించేవాడిని. అది సాధ్యం కాలేదు. అటు ప్రయత్నం ఇటు చదువు మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ పూర్తిచేయగా డిల్లీలో జీవితానికి సరిపడా జీతంతో మంచి కొలువు దొరికింది. రెండుసంవత్సరాల ఉద్యోగం తర్వాత నన్ను నేను తెలుసుకోని ఆదిలాబాద్ అడవులు, కొండలు, గుట్టలు, జలపాతాలు యాదికొచ్చేవి. ఏదైనా లోకల్ ఉండి అనుకున్నది సాధించాలనే మళ్ళీ హైదరాబాద్ తోవచూశాను.
తిండి,తిప్పలతోటి ,ఆర్ధికబభారంతో అరిగోసపడ్డాను.మోసాలు, కుట్రలు, కుతంత్రాలు అన్ని చూశాను.అయినా ఎనుకకు పోబుద్ది కాలేదు.
దగ్గరి సోపతి సహాయంతో మొదటిసారి అవకాశం వదలకుండా పాట రాసాను.
“శతమానభవతి చరితల్లోనే మురిసే చైత్రాలై వాలేనే మాలో గీతాలై
అభిమానం గెలుపై పువ్వుల్లోనే కురిసే ముత్యాల హారాలే భావాలై
మదిలో మెదిలే నదిలా కదిలే ఇంకా ఏవో పాడేనే”అనే పాటతో సింగిల్ కార్డు రచయితగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. మంచి పేరు వచ్చింది. అక్కడి నుండి నేను వెనుక తిరగకుండా రాస్తూనే ఉన్నాను.
CLiC2NEWS: తెలంగాణ గ్రామీణ పదాలు ఈ మధ్య మొయిల్ సినిమాలో అద్భుతమైన పాట రాశారు. ఆ పాట అన్ని వర్గాల వారిని బాగా ఆకట్టుకుంది.. దాని గురించి..?
మౌళి: “స్వప్న సినిమా” కంబాలపల్లి కథలో
తెలంగాణ యాసలోన పాట రాసాను.
“హే…..బొమ్మ బొరుసంటూ వేసే పంట ఏదో ఒకటేనంటా
కోతి కొమ్మచ్చి నిన్నే గిచ్చే రేపే నీలో తంటా
పారే నీరు జారే తీరు మారేనా తోవే కూడేనా
కలలో ఉన్నాడే
కలతే చెడేనా
అదుపే తప్పేనా ….. గజిబిజిలో
అడుగే వింతాయే
కొసరే చేరేనా
కబురే వచ్చెనా …… నిజమవునా
టిప్పిరి టిప్పిరి టిటి టిప్పిరి టిప్పిరి టిటి
చరణం
గవ్వలేస్తేనే గళ్లుదాటెనా ఎదురేముందో తెలివదుగా
మందకదిలేనా గంటకడితేనే ఒక సాలెంటా నడుచునుగా
ఎగిరేటి బూగ నీకాడికొచ్చేనా చెట్టు చేమ
గుట్టేదాటెనా
దునికేటి శాప నీటిలోకి జారేనా గాలంవేస్తే చిక్కుకుపోయేనా”
తెలంగాణ భాష చాలా జీవధారభాష అంతా కమ్మగా ఉంటుంది. “తోవచేరేనా”,”తోవకలిసేనా” “తోవ తెలిసేనా” అనే పదాలు తెలంగాణలో వాడుతారు “తోవకూడడం”అని రాయడంతో కొత్త రచయితలు చాలా ఆసక్తితో అడిగారు.
“ఎగిరేటిబూగ నీకాడకచ్చెనా సెట్టుసేమ గుట్టెదాటెనా”రతెలంగాణలా దువ్వెన,ఈర్ఫనీ ఆంధ్రలో తూనీగ అనే వాడుకలో ఉంది. బూగ అని అచ్చమైన తెలంగాణ భాష రాయడం సంత్రుప్తి ఇచ్చింది.
ఆగస్తీ సంగీతం,సాయి వాగ్దేవి గొంతులోంచి అమ్రృతంగా జనాల హ్రృదయాలను మైమరిచేలా చేసింది.ఉదయ్ గుర్రాల దర్శకత్వంలో సినిమా అత్యున్నత స్థాయి తెలంగాణ సినిమాగా తెరకెక్కింది.
CLiC2NEWS: పరేషాన్ సినిమా”సౌ సారా చటాక్కారా”యూత్ మందుపాట బాగా ట్రెండ్ సెట్టర్ అయ్యింది. ఆ పాట గురించి చెబుతారా?
మౌళి: తెలంగాణ యాస,బాస ఉండాలీ. ప్రాంతీయంగా సింగరేణి బొగ్గుబాయిల మందుతాగి ఎట్లా దునుకుతరో అది పాటలుండాలని షరతు.దీన్ని రాయటానికి చాలా శ్రమించాను. అల్లం రాజయ్య కథలోని భాషను బాగా అధ్యయనం చేశాను.అవి రాసుకున్నాను. అపుడు ఎట్లా రాయాలో తోచింది.
సౌ సారా సౌరా సౌరా చటాక్కారా
పోదాం పారా…. 2
బగ్గా తాగుదాం
బొర్ర పెంచుదాం
బజార్లనే పందాం
కాళ్లకూర తింటాం
సప్పుడేక ఉంటాం
పందిలెక్క పంటాం
రందిబాపె తీర్థం
అలవాటైన పానం
బొత్తలింతా పోద్దాం
బొందలవడ్డా ఇడువం
ఓరి వారి ఓరోరి వారి-2
సౌ సార సౌర చటాక్కారా పోదాం పారా-2
చరణం
పీకుడు మాటలు అనుడు ,అనుడు
పిచ్చికథలు వడుడు, వడుడు
లొల్లి లొల్లి జేసుడు ,జేసుడు
గాయి గత్తర సేతలు, సేతలు
బిచ్చపు లెక్కలు, లెక్కలు
సోది ముచ్చట్లు ముచ్చట్లు ,ముచ్చట్లు
సతగాని ఏశాలు సత్తెనాశనం బతుకులు
గాయిదోళ్ళు సోపతిగాళ్ళు
అవలా గాళ్ళు బిత్తిరిగాళ్లు
నకురాలు నల్లీకుట్లోళ్లు
నప్పతట్లొల్లు ఎచ్చొలోళ్లు
గాలిమాటల గబ్బుగాళ్లు
గాలిమాటలు గబ్బుగాళ్లు
గాలిమాటలూ గబ్బుగాళ్లు
అగడువట్టి తాగుడు
తలకాయకూర నాకుడు
శనగ్గూడలు బుక్కుడు
లొల్లి లొల్లి వాగుడు
ఒడవనీ పంచాయితీ బారెడు
నెత్తిల పురుగు మెసులుడు
ఓరివారి ఓరోరి వారి
“కాళ్లకూర తిందాం”అని రాశా అదోక ఆహారపు అలవాటు మందుతాగేటప్పుడే వాడే భాషను పొందిచ్చినాను.ఇలాంటి చాలా తక్కువ మంది గీత రచయితలకు వస్తుంది.దర్శకుడు రూపక్ రోనాల్డ్ సన్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు.తెలంగాణలో ట్రెండ్ సెట్టర్ చేసే పాట రాశావని మెచ్చుకున్నాడు.
CLiC2NEWS: మీకు గ్రామీణ ప్రాంతాల్లో భాష, యాసమీద పట్టు ఎట్లా వచ్చింది?
మౌళి: గంగీవల మాది. కార్మిక, మైదాన ఆదివాసి మనుషులు మరియు రీతి, రివాజులు మాటతీరు కూడా వేరు ఉంటుంది. ఆదిలాబాద్ ఉర్దూ, మరాఠీ, తెలుగు, గొండి, కొలాం భాషలు మాట్లాడతారు. అది వింటుంటే భాషమీద బయటికి తీసుకురావాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నాను.
అల్లం రాజయ్య సాహిత్యం ఏది వదలకుండా చదివాను. భాషమీద, సినిమా పాట మీద ఆనేక సార్లు నాకు బోధించేవారు. తెలంగాణలో మొదటితరం నవల నుంచి ఇప్పటివరకు భాషమీద వస్తున్న మార్పులు అధ్యయనం చేశాను.
CLiC2NEWS: అంతర్జాతీయ స్థాయిలో జపాన్ టూరిజం ఫిల్మ్ ఫెస్టివల్ ఆవార్డు మీ పాట యొక్క అనుభూతిని తెలుపండి?
మౌళి: “నా తెలంగాణ కోటి రత్నాల వీణ
ఈ మట్టి వాసనలోన కోట కొండ కోన
నా తెలంగాణ కోటి రత్నాల వీణ
ఏనాటి నుంచో ఇది కళల ఖజాన “ఈ తెలంగాణ టూరిజం థీం సాంగ్ “జపాన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్” ఆవార్డు 2017 వ సంవత్సరం ఒసాకలో గెలుచుకుంది. దూలం సత్యనారాయణ దర్శకత్వంలో వీడియో చేశారు.
తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా అడవులు, మిట్ట జలపాతాలు, ఎత్తైన కొండలు, లోయలు, జోడేఘాట్, కెరమేరి, గిరిజన జీవితాల ప్రజలు రీతి రివాజులు ప్రత్యేకంగా తిరిగి ఈ పాట రాయడం జరిగింది.
CLiC2NEWS: మీరు తెలంగాణ కథలు, సాహిత్యం అధ్యయనం కోసం వేల కిలోమీటర్లు పర్యటించారు అనుభవాలు, అనుభూతులు చెబుతారా?
మౌళి: 2010 నుంచి తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిమూల తిరిగాను.అటు జోడేఘాట్ నుంచి జోగులాంబ వరకు, అటు ఎల్లంపల్లి నుంచి ఏటూరునాగరం దాకా, గొల్కోండ నుంచి గోదారిదాకా తిరిగి చాలా విషయాలు అనుభవం ద్వారా నేర్చుకున్నాను. ఒక్క అదిలాబాద్ అడవి గొండు, కొలామ్, పరధాన్, తోటి వారి రీతి, రివాజు ల గురించి మూడు నెలలు వారితోటి గడిపాను.
ఎట్లాజీవించాలో, ఎలా బతుకాలో చాలా తెలిసింది.
CLiC2NEWS: తెలంగాణ గీతరచయితలు తెలంగాణ భాషని ఉపయోగిస్తున్నరని అనుకుంటున్నారా?
మౌళి: సాధారణంగా గీత రచయితలు మధ్యతరగతి నుంచి వస్తున్నారు. అనేక కారాణాల చేత వాళ్ళు పట్టణాలతో స్థిరపడుతున్నారు. ఎక్కువగా జనాలంతా గ్రామాల్లో జీవిస్తున్నారు.
ఆ గ్రామాల్లోని జీవభాష, మాండలికం మధ్యతరగతి గీతరచయితలకు వాటిమీద అధ్యయనం పరిశీలన లేకపోవడంతో వారికి తెలిసింది వ్యక్తిగతానుభవంలో తెలిసినవి పాటలుగా రాస్తున్నాను. ఇంకా జనం నుంచి గీతరచయితలు అభివృద్ధి కాలేదు.
CLiC2NEWS: “కంబాల పల్లి కథలు ” సినిమా “న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎంపికైనది”దానికి రాశారు. కంగ్రాచులేషన్.
మౌళి: చాలా ఆనందంగా ఉంది.తెలంగాణ సినిమా ఎల్లలు దాటి జూన్ 4 వ తేదీ నూయర్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ “హే బోమ్మా బొరుసు” పాట కూడా భాగస్వామ్యం కావటం ఆనందమే. అది స్వప్న సినిమా మరియు ఉదయ్ గుర్రాలకు ప్రత్యేక క్రృతజ్ణతలు.

CLiC2NEWS: ఈ మధ్యనే “పరేషాన్”సింగరేణి బొగ్గు గనుల కథ నేపథ్యంలో దర్శకుడి రూపక్ గారితో అనుభవాలు..
మౌళి: కోవిడ్ సమయంలో యాభై ఐదు రోజులు మంచిర్యాల సింగరేణి ప్రాంతంలో చేసేటప్పుడు నా ఆలోచనలను ఇదివరకు ఈ ప్రాంతంలోని మనుషులతోటి, పల్లెలతోటిచేసే, కళాకారులతో అనుబంధం సినిమాకు చాలా”పరేషాన్”అందరు ఆయనతో చాలా విషయాలు దగ్గరి నుండి అర్ధంచేసుకోగలిగాను. ఇది చిన్న సినిమాలు మంచిర్యాల ప్రాంతంలో చేసుకోవచ్చని అర్ధమైంది. మరింత కొత్త దర్శకులకు బాట వేస్తుందని అనుకుంటున్నాను.
CLiC2NEWS: ఆదిలాబాద్ నేపథ్యంలో నవల గురించి..
మౌళి: ఈ మట్టి ఓ అధ్యయనం కేంద్రం. గోదావరి జీవనాగరికత చాలా వైవిధ్యంగా ఉంటుంది. వాతావరణం, మనుషులు, రీతిరివాజులు, అనేక చారిత్రక సంఘటనలతో కూడిన నవల మీద రిసెర్చ్ చేస్తున్నాను.
CLiC2NEWS: “మొక్కలు నాటితే మనమే-చిగురులు వేయును వనమే” తెలంగాణ అటవీశాఖ కాలర్ ట్యూన్ రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకుంది కదా ఆ అవకాశం ఎలా వచ్చింది.?
మౌళి: కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హారితహారం కార్యక్రమం ఏర్పాటుచేశారు. దానికి అనేకమంది పాటలు రాయగా నా పాటను కాలర్ ట్యూన్ అటవీశాఖ అఫీషియల్ గా ఎంచుకుంది. దానిద్వారా తెలంగాణ అటవీ అధికారులకు నా పేరు సుపరిచితం.
CLiC2NEWS: ఆదిలాబాద్ అడవుల జీవవైవిధ్యం మీద అనేక వ్యాసాలు రాసారు వాటి గురించి..
మౌళి: తెలంగాణ రాష్ట్రంలోని “ఆసిఫాబాద్- కుం రం భీం జిల్లా” అటవీశాఖ ఆధ్వర్యంలో “బర్డ్ వాక్ ఫెస్టివల్”ను డిసెంబర్ 14,15 తేదీలు 2019వ కాగజ్ నగర్, పెంచికల్ పెట్, బెజ్జూర్ పరిధిలో గల అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేశారు.
కాగజ్ నగర్ కోసిని, సిర్పూర్ (టి) మాలిని గుట్టలు, బెజ్జూరు పాలరాపు గుట్టలు, మెర్లిగూడ అటవీప్రాంతం మరియు ఆసిఫాబాద్ అడ “కుం రం భీం ప్రాజెక్టు” బర్డ్ వాక్ ఫెస్టివల్” నాకు ప్రత్యేకమైన ఆహ్వానం ముఖ్యోద్దేశం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కొండలు, కొనలు, జీవవైవిధ్యం పులలు సంరక్షణ మరియు నందిగామ కొండల్లోని పాలరాపు గుట్ట రాబందుల ఆవాసం మీద పరిశోధన చేసి తెలంగాణా ప్రభుత్వం ఆందజేయాలని అటవీశాఖ అధికారుల విన్నపం మేరకు అందులో నేను పాల్గొన్నాను.
ఇప్పుడు మనం పులులు తిరిగే ప్రదేశం గురించి పేపర్లలో చదివాము.అగర్ గూడ పులలు స్ధావరంలోనే రెండు రాత్రులు నూటయాభై మందితో గడిపాము. ఆదివాసుల జీవితాలు అడవిపట్ల వారి కృతజ్ఞత.. ఎలా జీవిస్థారో.. ఏలా జీవించాలో ఇంతకుముందు నా అనుభవం మరింత తోడ్పడ్డాయి.
రెండురోజులు పూర్తిగా దట్టమైన అడవిలో గడిపాను. ఆ పరిశోధన వ్యాసం రాశాను. దాన్ని వేణుగోపాల్ సాట్ల, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందజేశాను. అది మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
CLiC2NEWS: మంచిర్యాల మట్టి గురించి పాట రాశారు.. అది కొంచెం వివరంగా..
మౌళి: “గొండొల్ల గుస్సాడుంది కోయోల్ల ధింసా ఉంది మణిహారంగా..
గోదావరి ప్రవహిస్తుంది గనులకు నిలయమైంది కంఠహారంగా
అనేక భిన్న సంస్కృతులు విరబూసిన కొత్త ఆశలు
మనమంచిర్యాల జిల్లా గాంధారి ఖిల్లా
పారిశ్రామిక జీవితాలు,ఆదివాసి,మైదాన జీవితాలు మట్టిలో దాగిన గురించి చాలా పేరు వచ్చింది.

CLiC2NEWS: కుమురం భీంతో కలసి పోరాడిన అతి దగ్గరి సోపతిని కలిశారు ఆయన గురించి?
మౌళి: ఆయనను కలవడం అతి గొప్ప అచివ్ మెంట్.. కేడా మావయి కూకూ గొండురాజ్యం కూకూ అనే పాటతో ఆదివాసిభాషలో నాముందు పాటందుకున్నాడు. నూటపది సంవత్సరాల కురువృద్ధుడు. మాన నాటె మావరాజ్యా (మన ఊరిలో మనరాజ్యం) జల్, జంగీల్ మరియు జమీన్ పోరాటం చేసిన భీం చరిత్రను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిని టెకం మాని. నేను జోడేఘాట్, ఆయన గిరిజన గ్రామం బాబేజరిలో అధ్యయనం కోసం వెళ్లగా అతను గురించి తెలిసింది.
టెకం మాని వయస్సు పదిహేనెండ్లు భీం పోరాట సమయానికి మొవడ నుంచి జోడేఘాట్ అడవిసాపుచేసుకొని గుడిసెలు కట్టుకుని వచ్చినారు. అందరం కలిసి ఉంటె ఎవ్వడేమి సెయ్యడని దైర్యమిచ్చిండు.
జోడేఘాట్ యుద్దం మీటింగ్, ఆ తిరుగుబాటు మోగిన తుడుందెబ్బ ఆ సంగతులను యాది జేసిండు. పన్నెండు గంటల ఫైరింగ్ జరిగిన మాటలు ఇరవై ఏండ్లు నాటి యుద్దం కండ్లముందే జరిగినట్లు చెప్పినాడు. “విత్తనం చనిపోతూ పంట వాగ్దానం చేసిన తీరుగా” భీం ఆశయాలను వివరించాడు. అదంతా ఆడియో విడియోగా రికార్డు చేశాను. అదోక అదివాసి చరిత్రను నేను అధ్యయనం చేయడానికి కలవడం ఎప్పటికీ త్రృప్తినిచ్చేది. త్వరలో డాక్యుమెంటరీ, పాటలు నా ప్రోడక్షన్లో అంతర్జాతీయ స్థాయిలో ఫిల్మ్ చేస్తాను.
CLiC2NEWS: మీరు రాసే పాటలకు ప్రేరణ ఎవరు?
మౌళి: ప్రకృతి, సమాజం, మనుషులు భావోద్వేగం, స్పందన రచనలు, స్థల, కాలాల నేపథ్యం

CLiC2NEWS: మైఖల్ యార్క్ తో ఆసిఫాబాద్ వచ్చినపుడు కలవడం ఎలా ఉంది?
మౌళి: మైకల్ యార్క్ ప్రముఖ ఫిల్మ్ మేకర్, ఫోటోగ్రాఫర్, నలభై సంవత్సరాల తరువాత వచ్చారు గిన్నెదరికి వచ్చారు. రాజుగొండు మీద స్ధానికుల సహాయంతో దండారి యొక్క పద్దతుల మీద 1976-78 సంవత్సరంలో ఇప్పటి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని లోయలోని గిన్నెధరి గ్రామంలో అధ్యయనం చేశాడు.అదే చోట ఆయనను కలవడం ఒక సినిమా గీత రచయితగా చాలా గొప్ప అనుభూతి కలిగింది.
యార్క్ గారితో రెండు గంటల పైనే సినిమాల గురించి మాట్లాడాము. అదిలాబాద్ మీద రిసెర్చ్ చేస్తున్నాని చెప్పాను. ఫిబ్రవరి 12,2019 సంవత్సరం నుంచి మా మధ్య అనుబంధం కొనసాగుతుంది.యార్క్ పై ప్రస్తుతం డాక్యుమెంటరీ నిర్మాణ పనుల్లో ఉన్నాము.
1980 వ సంవత్సరంలోనే దాదాపు 1500లకు పైగా తీసిన అపురూపమైన ఫోటోలు తీశాడు.అదే సమయంలో దండారి పండుగ గురించి బి.బి.సి. కోసం “”Raj Gonds: Reflections in a Peacock Crown” అనే డాక్యుమెంటరీ చిత్రీకరణ చేశాడు. దానివల్ల ఇక్కడి కల్చర్ ప్రపంచమంతా తెలిసింది.
రెండు వ్యాసాలు రాశాడు.ఇపుడు వాటిని చదివాను.1920లో రోడ్డు వేయడం ఎలాంటి మార్పులు సమాజంలో వచ్చాయనేది వివరంగా తెలిపారు .మొదటితరం ఫిల్మ్ మేకర్ ని కలవడం సంతోషం, విజ్ఞానం, ఆచరణీయం
CLiC2NEWS: ప్రాంతీయంగా సాహిత్యం.. కళాకారుల అభివృద్ధి కోసం మీ వంతుగా ఏమైనా చేస్తున్నారా?
మౌళి: నాకు చిన్నప్పటి నుంచి కలలన్నా కళాకారులన్నా చాలా ఇష్టం. 2012 నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ యొక్క నైసర్గిక స్వరూపం, సంస్కృతి సంప్రదాయాలు భాష, యాస అవపోసనమైంది. వెనుకబడిన జిల్లా అనే ముద్ర బలంగా పోగోట్టాలని తండ్లాటుంది. కొత్తగా కళాకారులని కలుపుకుంటూ ఎన్ ఆర్ ఐ లతో “మంచిర్యాల ఎమర్జింగ్ ప్రాంతీయ లోకల్ ఫిల్మ్ ఇండస్ట్రీ హబ్” కొంతమంది సభ్యులతో తయారుచేశాము. మంచిర్యాలలో “పరేషాన్”సినిమా లోకల్ టాలెంట్, ప్రొడక్షన్ వాల్యుతో “మన గ్రామాల్లో మన సినిమా” అనేది పూర్తి అయింది. ఈ చిత్రాని దర్శకుడు కూడా మంచిర్యాల వాసే కావడం విశేషం. కరోనా నేర్పిన పాఠంతో ఎప్పుడూ లోకల్ ప్రోడక్ట్ ఇంటర్ నేషనల్ చేయాలి అప్పుడే అవకాశాలు అందుతాయి. రానున్న రోజుల్లో ఎక్కువ మందికి అవకాశాలు ఇస్తు అందరం ఎదగాలనేది ముఖ్యోద్దేశం.
ఆసిఫాబాద్ జిల్లాలో తిర్యాణి మండలంలో గల ఆదివాసుల యువతీ,యువకుల ప్రాంతీయంగా షార్ట్ ఫిల్మ్ అద్భుతంగా తీస్తున్నారు. ఇప్పటికే “జల్ జంగల్ జమీన్ “ప్రాంతీయంగా వారికి సినిమా మరియు థియేటర్ వర్క షాఫ్ పట్ల అవగాహన కార్యక్రమం చేశాం. తెలంగాణలో ఆదివాసి గ్రామీణ సినిమాలు క్రమానుగతంగా తీయడానికి వారికి తర్ఫీదు శిక్షణ ఇస్తున్నాం. కొత్త తరం టెక్నీషియన్లను చూడబోతున్నాం.

CLiC2NEWS: ప్రస్తుతం మీరు సినిమాలకు పాటలు రాస్తున్నారు..?
మౌళి: తొమ్మిది సినిమాలు ఉన్నాయి. కొన్ని సినిమాలు రిలీజ్ తయారుగున్నాయి.
CLiC2NEWS: జానపద పాటలు రాశారా?
మౌళి: జాపపదం అనేది జనాల నుంచి వచ్చినది. అది పెద్ద తెలంగాణ యాస, బాసల బండాగారం. ప్రతి పది కిలో మీటర్లకు మాండలికం మారుతుంది. దాన్ని ఖచ్చితత్వంతో నేర్చుకోవాలి. ఇప్పుడు ఆదిలాబాద్ జానపద సాహిత్యం అధ్యయనం చేస్తున్నాను. సినిమాలలో చక్కని జానపదం, సినిమా పరిధిలో ఉంటూనే తెలంగాణ జీవభాష సొబగులు అందిస్తాను. తెలంగాణ ఆసిఫాబాద్ పరధాన్ లు తెలుగు మాట్లాడుతారు. అది చాలా అద్భుతంగా ఉంటుంది ఆ యాస, భాసను సినిమాకు పరిచయం చేయాలని ఉంది. గొండి, కొలాం భాషలోని పాటలు తెలుగులో రాయడానికి ఆభాషని నేర్చుకుంటున్నాను. దానికి అనేకమంది సహాయంగా ఉన్నారు.
-బాలు
సినిమా రంగానికి కావాల్సిన మేలిరత్నం అక్కల చంద్రమౌళి. ఇలాంటి కవి, రచయితను టాలీవుడ్ అక్కున చేర్చుకోవాలి. మనసున్న కవి మంచి పాటలు రాయగలరు. హ్యాట్సాఫ్ చంద్రమౌళి గారు.
మీ యొక్క క్లిక్2న్యూస్ మరింత ముందుకు ఎదగాలని కోరుకుంటున్నాను.మంచి ఇంటర్వ్యూ రాసినందుకు ధన్యవాదాలు