జల వివాదంపై ప్రధానికి, జలవనరుల మంత్రికి సిఎం జగన్ లేఖ

అమరావతి (CLiC2NEWS): తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వేరు వేరుగా లేఖ రాశారు. తెలంగాణతో ఉన్న జల పంచాయతీ పై ప్రధాని మోడీకి ఐదు పేజీల లేఖ రాశారు జగన్. జల వివాదంపై తక్షణం కేంద్రం జోక్యం చేసుకోవాలని జగన్ కోరారు. విద్యుత్ ఉత్పత్తి కోసం అక్రమంగా తెలంగాణ వాడుకుంటున్న నీటిని నిలుపుదల చేయాలంటూ లేఖలో సీఎం పేర్కొన్నారు.
`విద్యుత్ ఉత్పత్తికి నీటిని విడుదల చేయొద్దన్న ఆదేశాలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ నీటిని విడుదల చేస్తోంది. ఈ చర్యలు అంతర్రాష్ట్ర సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నాయి. కింది ప్రాంతాల హక్కులను కాలరాసేలా తెలంగాణ చర్యలున్నాయి. తెలంగాణ చర్యల వల్ల రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల తాగునీరుకు కూడా సమస్యలు తలెత్తుతాయి. ఎలాంటి వ్యవసాయ అవసరాలు లేకున్నా నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ నీళ్లను వాడుకుంటోందని` సిఎం జగన్ లేఖలో పేర్కొన్నారు.
`శ్రీశైలం ప్రాజెక్టులో 834 ఫీట్ల వరకు నీళ్లు ఉంటేనే విద్యుదుత్పత్తికి నీళ్లు వాడుకోవాలి. ప్రస్తుతం శ్రీశైలంలో కేవలం 808 ఫీట్ల వరకే నీళ్లున్నాయి. 33 టీఎంసీలు తక్కువగా ఉన్నా.. తెలంగాణ నీళ్లు వాడేస్తోంది. వాళ్ల ప్రాంతంలో పవర్ హౌజ్ ఉంది కాబట్టి ఇష్టానుసారంగా విద్యుదుత్పత్తి పేరిట నీళ్లు వాడుతున్నారు. ప్రతీ రోజు తెలంగాణ 2 టీఎంసీల నీటిని విడుదల చేస్తోంది. కేఆర్‌ఎంబీ పరిధిని స్పష్టంగా నిర్వహించాలి. కేఆర్‌ఎంబీ పరిధిని నోటిఫై చేయాలని` అని లేఖలో ముఖ్యమంత్రి కోరారు.