వరద ఉధృతిపై అధికారులతో జలమండలి ఎండీ సమీక్ష
జలాశయాలను సందర్శించిన జలమండలి ఎండీ దానకిశోర్
హైదరాబాద్ (CLiC2NEWS): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జంట జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ఉస్మాన్‌సాగర్(గండిపేట), హిమాయత్ సాగర్ జలాశయాలు నిండుకుండల్లా మారాయి. ఇన్‌ఫ్లో భారీగా ఉండటంతో రెండు జలాశయాల గేట్లు ఎత్తి నీటిని మూసీ నదిలోకి వదులుతున్నారు. ఉస్మాన్ సాగర్ 13 గేట్లు, హిమాయత్ సాగర్ 8 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్ ఇన్‌ఫ్లో 7500 క్యూసెక్కులు ఉండగా ఔట్‌ఫ్లో 8281 క్యూసెక్కులు ఉంది. హిమాయత్ సాగర్ ఇన్‌ఫ్లో 7000 క్యూసెక్కులు ఉండగా ఔట్‌ఫ్లో 7,708 క్యూసెక్కులు ఉంది.
భారీగా వరద చేరుతున్న జంట జలాశయాలను బుధవారం ఉదయం జలమండలి ఎండీ దానకిశోర్ సందర్శించారు. వరద ప్రవాహాన్ని పరిశీలించిన ఆయన అధికారులతో సమీక్షించారు. రెండు జలాశయాల వద్ద భద్రత మరింత పెంచాలని పోలీసులకు సూచించారు. సామాన్య ప్రజలు, సందర్శకులు జంట జలాశయాల వద్దకు రావొద్దని ఆయన కోరారు. మూసీ నదిలోకి నీటిని వదులుతున్నందున నది పరివాహక ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన జలమండలి, జీహెచ్ఎంసీ, పోలీసుల శాఖకు సూచించారు. మూడు పోలీస్ కమిషనరేట్లతో జలమండలి నిరంతరం సమన్వయం చేసుకుంటోందని తెలిపారు. గత సంవత్సరం ఒక్క హిమాయత్ సాగర్ నుంచే 26 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని, ఈసారి రెండు జలాశయాల నుంచి కలిపి కూడా గతసారి కంటే తక్కువ నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జలమండలి టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్, ట్రాన్స్మిషన్ సీజీఎం దశరథరెడ్డి, జీఎంలుల, డీజీఎంలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.