శివారు మున్సిపాలిటీల సీవరేజి నిర్వహణకు జలమండలి సమాయత్తం

అధికారులతో జలమండలి ఎండీ దానకిశోర్ సమీక్ష
అన్ని వార్డుల్లో హాట్‌స్పాట్స్ గుర్తించాలని సూచన
సరిపడా యంత్రాలు, సిబ్బంది ఉండేలా చూసుకోవాలని ఆదేశం
హైదరాబాద్ (CLiC2NEWS): వచ్చేనెల 1వ తేదీ నుంచి జీహెచ్ఎంసీలోని శివారు మున్సిపాలిటీల సీవరేజి నిర్వహణ బాధ్యతలు జలమండలి తీసుకోనున్న నేపథ్యంలో ఇందుకు తగ్గ ఏర్పాట్లను చేసుకుంటోంది. ఇందులో భాగంగా సోమవారం జలమండలి ప్రధాన కార్యాలయంలో శివారు మున్సిపాలిటీల పరిధిలోని జలమండలి సీజీఎం, జీఎంలు, డీజీఎంలు, మేనేజర్లతో జలమండలి ఎంపీ దానకిశోర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సీవరేజి నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలను ఆయన అధికారులకు వివరించారు.
ఈ సందర్భంగా దానకిశోర్ మాట్లాడుతూ…
జలమండలి సీవరేజి నిర్వహణ బాధ్యతలు తీసుకుంటున్న 66 జీహెచ్ఎంసీ వార్డుల పరిధిలోని అధికారులు వెంటనే వార్డులవారీగా తరచూ మురుగు పొంగే హాట్‌స్పాట్‌లను గుర్తించాలని ఆదేశించారు. ప్రతీ మేనేజర్ వార్డువారీగా ఒక ఫిర్యాదుల రిజస్టర్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. సీవరేజి సంబంధిత ఫిర్యాదుల స్వీకరణకు జలమండలి కస్టమర్ కేర్ 155313తో పాటు వార్డువారీగా ప్రత్యేక మొబైల్ నెంబర్‌లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. సీవరేజి సమస్యలపై సమాచారలోపం లేకుండా వార్డుల వారీగా సీజీఎంలు, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు, కార్పొరేటర్లు, మేనేజర్లతో ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకొని సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. సీవరేజి సమస్యలపై వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.
అక్టోబరు 1వ తేదీ నుంచి సీవరేజి నిర్వహణ చేపట్టనున్న 66 వార్డులకు సంబంధించి కావాల్సిన సామాగ్రి, యంత్రాలు, కార్మికులను జీహెచ్ఎంసీ నుంచి తీసుకోవడానికి ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కాగా, ప్రస్తుతం వర్షాలు ఎక్కువగా కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆపరేషన్స్ డైరెక్టర్-2 స్వామి, సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, మేనేజర్లు పాల్గొన్నారు.