వాణిజ్య కనెక్షన్లపై జలమండలి స్పెషల్ ఫోకస్
ఆన్‌లైన్‌లో బిల్లుల జారీ, వసూలు దిశగా చర్యలు

బకాయిల వసూలుపై ప్రత్యేక దృష్టి
ఏప్రిల్ 1 నుంచి ఆన్‌లైన్‌లోనే వాణిజ్య కనెక్షన్ల బిల్లుల చెల్లింపు
రెవెన్యూ సమీక్షలో జలమండలి ఎండీ దానకిశోర్
హైదరాబాద్ (CLiC2NEWS): వాణిజ్య కనెక్షన్ల బిల్లుల జారీ, వసూలు ఆన్‌లైన్ ద్వారా జరిపాలని నిర్ణయించినట్లు జలమండలి ఎండీ దానకిశోర్ పేర్కొన్నారు. దశలవారీగా ఈ ప్రక్రియ ప్రారంభించి ఏప్రిల్ 1వ తేదీ నుంచి 100 శాతం ఆన్‌లైన్‌లో బిల్లుల జారీ చేసి, ఆన్‌లైన్ ద్వారానే వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. బుధవారం(22.12.2021) ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో సీజీఎంలు, జీఎంలతో ఆయన రెవెన్యూపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా ఇప్పటికే అన్ని పైప్‌పైజు కలిగిన నాన్ డొమెస్టిక్(వాణిజ్య) కనెక్షన్లను గుర్తించి, జీయో ట్యాగింగ్ చేసినట్లు తెలిపారు. ఈ కనెక్షన్లకు ఆన్‌లైన్‌లో బిల్లులు జారీ చేసి, డిజిటల్ పద్ధతిలో వసూలు చేసే విధానంపై ఇప్పటికే ఒక అధికారుల కమిటీ వేసి అధ్యయనం చేయించినట్లు చెప్పారు. వాణిజ్య కనెక్షన్లకు ఈమెయిల్, ఎస్ఎంఎస్, వాట్సాప్ వంటి మాధ్యమాల ద్వారా పూర్తిగా ఆన్‌లైన్‌లో బిల్లులు జారీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ బిల్లులు కూడా ఆన్‌లైన్‌లోనే వసూలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటినుంచే ఈ ప్రక్రియను ప్రారంభించి క్రమంగా ఏప్రిల్ 1 నాటికి పూర్తిస్థాయిలో అమలు చేస్తామన్నారు.
మీటరు పని చేయని, మీటరు లేని వాణిజ్య, హైవాల్యూ కనెక్షన్లకు కచ్చితంగా మీటరు ఉండేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి లోపు వీరు కచ్చితంగా ఏఎంఆర్ మీటర్లు అమర్చుకునేలా చూడాలని పేర్కొన్నారు. వాణిజ్య కనెక్షన్ల బకాయిలను పూర్తిస్థాయిలో వసూలు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇంతవరకు బిల్లులు చెల్లించని కనెక్షన్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, కచ్చితంగా వీరు బిల్లులు చెల్లించేలా చూడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, సీజీఎం రెవెన్యూ, జీఎంలు, ఎన్ఆర్‌డబ్ల్యూ డీజీఎంలు, తదితరులు పాల్గొన్నారు.
—