న్యాయాన్ని ప్రజల ఇంటి గడపకు చేర్చాలి: సిజెఐ
ఢిల్లీ (CLiC2NEWS): మన దేశంలో అనేక మంది ప్రజలు న్యాయవ్యవస్థపై అవగాహన లేకపోవటం వలన న్యాయ సహకారం పొందలేకపోతున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. న్యాయాన్ని ప్రజల ఇంటి గడపకు చేరువ చేసేలా జిల్లా స్థాయిలో న్యాయవ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో మొదటిసారి జిల్లా న్యాయ సేవల అధికారుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సిజెఐ జస్టిస్ ఎన్.వి.రమణ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిజెఐ మాట్లాడుతూ..
న్యాయ ప్రక్రియలో ప్రజలకు అతి దగ్గరగా ఉండేది జిల్లా న్యాయ సేవల అధికారులేనని, న్యాయస్థానాలపై ప్రజల అభిప్రాయం.. జిల్లా స్థాయిలో న్యాయాధికారుల నుండి వారికి ఎదురయ్యే అనుభవాలపై ఆధారపడి ఉంటుందని సిజెఐ అన్నారు. జిల్లాల్లో న్యాయవ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. సులభతర వాణిజ్యం, సులభతర జీవనం లాగే సులభతర న్యాయమూ అంతే ముఖ్యమని, దానికి న్యాయపరమైన మౌలిక సదుపాయాలు ఎంతగానో దోహదపడుతాయాని అన్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలు జైళ్లలో న్యాయసహకారం కోసం ఎదురుచూస్తున్న అండర్‌ట్రయల్ ఖైదీల విడుదలకు వేగంగా చర్యలు చేపట్టాలని న్యాయస్థానాలను మోడీ కోరారు.