రాష్ట్రంలో టెన్త్ పరీక్షల విధానంలో కీలక మార్పులు..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో పదో తరగతి పరీక్షల విధానంలో విద్యాశాఖ పలు కీలక మార్పులు చేసింది. ఇకనుండి టెన్త్ పరీక్షలను ఆరు పేపర్లతోనే నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి శ్రీదేవసేన సర్క్యులర్ జారీ చేశారు. ఆరు పేపర్ల పరీక్ష విధానం ఈ విద్యాసంవత్సరం నుండే అమలులోకి వస్తుందని ఉత్తర్వులు జారీ చేశారు. కాగా 9,10వ తరగతుల విద్యార్థులకు నిర్వహించే సమ్మెటివ్ అసెస్‌మెంట్-2 పరీక్షలు కూడా 6 పేపర్లతోనే జరగనున్నాయి.
కరోనా కారణంగా పదవ తరగతి పరీక్షలు 11 పేపర్లు కాక.. ఆరు పేపర్లతో నిర్వహించిన విషయం తెలిసినదే.
టెన్త్ పరీక్షల్లో 11 పేపర్ల వలన విద్యార్థులపై భారం పడుతోందని, వాటిని 6 పేపర్లకు కుదించాలని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ (ఎస్‌సిఇఆర్‌టి) విద్యాశాఖ ముందు ప్రతిపాధనలు ఉంచింది. ఈ ప్రతిపాదనలకు విద్యాశాఖ ఆమోదం తెలిపింది. అయితే.. ఫిజిక్స్, బయో, సోషల్ సబ్జెక్ట్‌లకు వేర్వేరు సమాధాన పత్రాలు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.