మండపేటలో భారీ ఎత్తున పీడీఎస్ బియ్యం పట్టివేత..

మండపేట(CLiC2NEWS) : మండపేట పట్టణంలో మంగళవారం రాత్రి పీడీఎస్ బియ్యాన్ని మాచవరం నుండి అక్రమంగా తరలిస్తుండగా మండపేట పట్టణంలోని కొందరు యువకులు కాపుకాసి పట్టుకున్నారు. ఈ పీడీఎస్ బియ్యం దందా గత కొన్ని సంవత్సరాలుగా ఇష్టారాజ్యంగా కొనసాగుతోంది. నిరుపేదలకు చేరాల్సిన బియ్యాన్ని కొందరు డీలర్లు దళారులు కుమ్మక్కై వాటిని తిరిగి కొనుగోలు చేసి రీసైక్లింగ్ కోసం మిల్లర్లకు తరలిస్తున్నారు. మాచవరం , మండపేట కేంద్రంగా ఈ పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా యధావిధిగా కొనసాగుతూనే ఉంది. కొందరు ఈ బియ్యాన్ని కొనుగోలు చేసి వాటిని విక్రయించటం పరిపాటిగా మారింది. ప్రజలకు పంపిణీ చేసే బియ్యంలో 40 శాతం పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా కావడం విశేషం. ఈ సమాచారం తెలిసిన వెంటనే మండపేట తహసీల్దార్ తంగెళ్ల రాజ రాజేశ్వరరావు తన సిబ్బందిని అప్రమత్తం చేశారు. మండల పౌరసరఫరాల అధికారి పద్మ, విఆర్వో గంటి శ్రీనివాస్, పట్టణ ఎస్ఐ ఎం. నాగరాజు తమ సిబ్బందితో వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అర్ధరాత్రి కావడంతో బియ్యం బస్తాల లెక్కింపు, పంచనామా, వాహనం సీజన్ మొదలైన కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది. బుధవారం ఉదయం వీటిని నిర్వహిస్తామని ఎమ్మెస్వో పద్మ మీడియాకు తెలిపారు. దాదాపు 50 బస్తాల బియ్యాన్ని అక్రమ రవాణా జరగడాన్ని అధికారులు గుర్తించారు. వ్యాన్ డ్రైవర్ దొమ్మి దుర్గాప్రసాద్, మాచవరం గ్రామానికి చెందిన బియ్యం కోనుగోలుదారుడు మల్లిడి రామారెడ్డిపై కేసులు నమోదు చేస్తున్నట్లు తహసీల్దార్ తంగెళ్ల రాజ రాజేశ్వరరావు తెలిపారు.