Hyderabad: జంట జలాశయాల గేట్లు ఎత్తివేత
Lifting the gates of the twin reservoirs
· ఈ సాయంత్రం ఉస్మాన్ సాగర్ రెండు గేట్లు ఎత్తిన అధికారులు.
· నేడు హిమాయత్ సాగర్ కు సైతం మరో రెండు గేట్లు ఎత్తివేత.
· దశాబ్దం తరువాత తెరుచుకున్న గండిపేట గేట్లు
హైదరాబాద్ (CLiC2NEWS): నగరానికి తాగు నీరు అందిస్తున్న జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ (గండిపేట) రిజర్వాయర్ల ఎగువ ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాల వల్ల రిజర్వాయర్లకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో.. జలమండలి అధికారులు ఈ రెండు రిజర్వాయర్ల గేట్లను ఎత్తి వరద నీటిని దిగువనున్న మూసీ నదిలోకి వదులుతున్నారు.
హిమాయత్ సాగర్ రిజర్వాయర్ :
ఇప్పటివరకు రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు రిజర్వాయర్ లోకి వరద నీరు 1762.60 అడుగులు (2.716 టీఎంసి)కు చేరుకుంది. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగా హిమయత్‌సాగర్ రిజర్వాయర్ యొక్క మరో రెండు గేట్లను ఒక అడుగు వరకు ఎత్తి వరద నీరును మూసిలోకి వదులుతున్నారు.
హిమాయత్ సాగర్ రిజర్వాయర్ కు మొత్తం 17 గేట్లు ఉన్నాయి. ఇప్పటికే మంగళవారం నాడు ఈ రిజర్వాయర్ నీటి మట్టం 1763 అడుగుల వద్ద మూడు గేట్లను ఒక అడుగు వరకు ఎత్తి దిగువనున్న మూసిలోకి వదిలారు. దీంతో ప్రస్తుతం మొత్తం ఐదు గేట్ల ద్వారా 1716 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు.
గత ఏడాది అక్టోబర్ 14న జలాశయానికి 25 వేల క్యూసెక్కుల నీరు పోటెత్తడంతో 13 గేట్లు ఎత్తి దిగువన ఉన్న మూసిలోకి వదిలారు.
- హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం : 1763.50 అడుగులు
- ప్రస్తుత నీటి స్థాయి : 1762.60 అడుగులు
- రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం : 2.968 టీఎంసీ లు
- ప్రస్తుత సామర్థ్యం : 2.716 టీఎంసీ లు
- ఇన్ ఫ్లో : 600 క్యూసెక్కులు
- అవుట్ ఫ్లో: 1716 క్యూసెక్కులు
- మొత్తం గేట్ల సంఖ్య: 17 గేట్లు
- ఎత్తిన గేట్ల సంఖ్య: 5 గేట్లు
ఉస్మాన్ సాగర్ (గండిపేట) రిజర్వాయర్ :
మరో వైపు ఉస్మాన్ సాగర్ (గండిపేట) కు కూడా ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు చేరడంతో జలమండలి అధికారులు ఈ రిజర్వాయర్ రెండు గేట్లు ఒక అడుగు వరకు ఎత్తి.. 200 క్యూసెక్కుల వరద నీటిని మూసి నది లోకి విడుదల చేశారు.
ఉస్మాన్ సాగర్ రిజ్వాయర్ కు మొత్తం 15 గేట్లు ఉన్నాయి. ఈ రిజర్వాయర్ గేట్లను దాదాపు దశాబ్దం తరవాత ఎత్తారు. చివరిసారిగా 2010 లో ఎత్తినట్లు జలమండలి అధికారులు పేర్కొన్నారు.
- ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం : 1790.00 అడుగులు
- ప్రస్తుత నీటి స్థాయి : 1784.90 అడుగులు
- రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం : 3.90 టీఎంసీ లు
- ప్రస్తుత సామర్థ్యం : 2.817 టీఎంసీ లు
- ఇన్ ఫ్లో : 400 క్యూసెక్కులు
- అవుట్ ఫ్లో: 200 క్యూసెక్కులు
- మొత్తం గేట్ల సంఖ్య: 15 గేట్లు
- ఎత్తిన గేట్ల సంఖ్య: 2 గేట్లు
జలమండలి ఎండీ దాన కిశోర్ సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ముందుజాగ్రత్తగా మూసి నది లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. జలమండలి సిబ్బంది మూసి నదికి ఇరువైపులా ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని, ప్రజలెవరూ అటువైపుగా వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా ఈ రిజర్వాయర్ల లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కాలనీలు, మురికివాడ ప్రాంతాలు మరియు మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు సన్నద్ధం కావాలని హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాల పరిపాలనా యంత్రాంగంతో పాటు.. జీహెచ్ ఎంసీ, పోలీసు అధికారులను ఆదేశించారు.