Lock down ఆఖరి అస్త్రం కావాలి: ప్రధాని మోడీ
రాష్ట్రాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విజ్ఞప్తి.. జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగం

న్యూఢిల్లీ (clic2news): కొన్ని వారాలుగా కరోనా సెకండ్ వేవ్ దూసుకొచ్చిందని.. తుఫానులా విరుచుకుపడుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దేశంలో కరోనా పరిస్థితులపై జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగిచారు. ప్రధాని లాక్డౌన్పై కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ ప్రసంగం అనగానే అందరిలో ఆసక్తి పెరిగిపోయింది. ప్రధాని మాట్లాడుతూ.. దేశంలోనే ఇప్పుడు లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితులు లేవన్నారు. లాక్డౌన్ నుంచి మనకు మనమే కాపాడుకోవాలన్నారు. రాష్ట్రాలకు లాక్డౌన్ను చివరి అస్త్రంగానే పరిగణించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. కరోనాను కట్టడి చేయడానికి కొన్నాళ్లుగా కఠినమైన పోరాటం చేస్తున్నాం. రెండో దశలో కరోనా మరింత తీవ్రమైన సవాల్ విసురుతుందన్నారు.
కోవిడ్ సెకండ్ వేవ్ తుపాన్ వలే విరుచుకు పడుతుందన్నారు.. కరోనాపై పోరాటం చేస్తున్న వైద్యులు, ఇతర వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ధైర్యంగా ఉంటేనే కఠిన పరిస్థితులను ఎదుర్కోగలం.. ఇటీవల మనం తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్లో పరిస్థితులను చక్కదిద్దుతాయి. అనేక రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత ఉందని, సరిపడా ఆక్సిజన్ సరఫరా కోసం కృషి చేస్తున్నామని అవసరమైతే ప్రతి ఒక్కరికీ ఆక్సిజన్ అందించే దిశగా పనిచేస్తున్నామన్నారు.
అనవసరంగా బయటకు రావద్దు..
అసరమైతేనే ప్రజలు బయటకు వెళ్లాలని మోడీ విజ్ఞప్తి చేశారు. దేశ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు ఆర్ధిక వ్యవస్థ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉందన్నారు. కరోనా మొదట వచ్చినప్పుడు అది ఏంటి? ఎలా ఎదుర్కోవాలని అనే విషయంపై కూడా క్లారిటీ లేదు.. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయన్నారు. ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన ఔషధ సంస్థలు భారత్లో ఉన్నాయి. కరోనా రెండో దశలో ఔషధాల కొరత లేదు. ప్రపంచంలోనే అత్యధికంగా టీకాలు వేస్తున్న దేశంగా మనదేశం నిలిచింది.. ఫార్మా కంపెనీలు ఔషధాల ఉత్పత్తిని పెంచాయి.. ఫ్రంట్ లైన్ వారియర్స్, సీనియర్ సిటిజన్లకు టీకాల ప్రక్రియ పూర్తి చేశామని.. ప్రస్తుతం 45 ఏళ్లు నిండినివారికి వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు దాటిన అందరికీ టీకాలు అందిస్తామన్నారు. 18 ఏళ్లు పైబడిన వారికి టీకాలు వేస్తే నగరాల్లో సత్ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నగరాల్లో పనిచేస్తున్న జనాభాలో 18 ఏళ్లు దాటినవారే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. కరోనాపై పోరులో రాష్ట్రాల సహాకారం ఎంతో బాగుందన్నారు.