సంక్రాంతి.. మా ఊరికి నేను..

జనవరి వచ్చిందంటే సంక్రాంతి గురించే ఆలోచన. పండక్కి ఎటు వెళ్లాలా అని… పిల్లలకు సెలవుల ఎప్పుడిస్తారు.. ఎప్పుడు బయలుదేరాలి.. ఎప్పుడు రిటన్ అవ్వాలి… అనే ప్లానింగ్‌లో ఉంటాం. ఈ సారి సెలవులు వారం రోజులు ఇచ్చారు. పిల్లలతో కలిసి మా ఊరికి బయలుదేరాం… హైదరాబాద్ ఎంజిబిఎస్ లో బస్సు బయలుదేరింది…
బస్సు దిల్సుఖ్నగర్ దాటుతోంది… పిల్లలు మొబైల్ చూస్తూ విండోస్లోంచి బయటకు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కరోనా మూలంగా చాలా రోజుల తర్వాత ఊరికి బయలుదేరాం.. దాంతో అంతా కొత్త అనుభూతి.. నేనూ సీట్లో రిలాక్స్ అవుతున్నా..
మా ఇల్లు.. మా గ్రామం మెల్లిగా గుర్తుకువస్తున్నాయి…. అలా అవన్నీ.. ఆలోచిస్తూ కూర్చుని ఆలోచిస్తున్నా.. మా ఊరి గురించి.. అక్కడే జరిగే పండగ సంబరాల గురించి. పక్కంటి వాళ్లు అడిగే ప్రశ్నలు గుర్తొచ్చాయి..
సంక్రాంతి పండగ అంటే రైతులకు పంటలు చేతికొచ్చాక సంతోషంగా జరుపుకొనేది అంటారు. కానీ నాకు అదంతా తెలియదు. నాకు తెలిసింది మాత్రం సంక్రాంతి అంటే వాకిట్లో ముగ్గులు వేయటం.. గొబ్బెమ్మలు పెట్టటం.. ఆ తర్వాత గంగిరెద్దుల వాళ్లు రావటం, జంగం వాళ్లు, హరిదాసులు రావటం తెలుసు… అలాగే పిండివంటలు చేయడం.. అవి అందరికీ పంచిపెట్టడం ఇలా తెలుసు…
పండగ వస్తుందంటే చాలూ.. గ్రామాల్లో బుడబుక్కల వాడు వచ్చేవాడు. ఉదయాన్నే ఐదు.. ఐదున్నర గంటలకు చలిలో మంచు పడుతూ ఉండేది… ఆ సమయంలో డమరుకం మోగించుకుంటూ వచ్చేవాడు. నేను ఆ శబ్ధానికి నిద్ర లేచేదాన్ని. అప్పుటికే అమ్మ ముగ్గు వేస్తూ ఉండేది… నేను వేయకపోయినా అమ్మవేసే దానికి వంకలు పెడుతూ ఉండేదాన్ని. మా ప్రెండ్స్ బాగా వేసేవారు. పెద్దపెద్ద చుక్కల ముగ్గులు వేసేవారు. అవి చూసినపుడు నాకనిపించేది, నేనూ నేర్చుకోవాలని.. అందరికంటే బాగా ముగ్గులు వేయాలని ఉండేది.
పండుగ సెలవులు ఇచ్చారంటే మా ఊరికి అత్తయ్య పిల్లలు వచ్చేవారు. ఇక అంతే సంగతులు ఆటలు పాటలు తప్ప వేరే ధ్యాస ఉండేది కాదు మాకు. జంగం వాళ్ళు, హరిదాసులు రోజూ పండగ అయ్యేంత వరకు వచ్చేవాళ్ళు. వాళ్లకి బియ్యం, కూరగాయలు. ఇంట్లో వండిన పిండి వంటలు రోజూ ఇచ్చేవాళ్లం. పెరటిలో ఉన్న కూరగాయలు సైతం కోసేసి బియ్యం ప్లేట్లో పెట్టి జోలిలో పోసే వాళ్లం .
మాబామ్మ పోరట్లోవి అన్నీ కోసేస్తున్నారా.. అంటూ బెదిరించేది… అయనా రెండో రోజూ మాది అదే పని. కానీ ఇప్పుడు ఆ పల్లెటూరులో కూడా వాళ్లెవరూ కనిపించడంలేదు. సంక్రాంతి సందడి గురించి పిల్లలకు చెప్పాలన్నా.. అప్పటి సరదాలు చూపించాలన్నా జంగంవారు కాని, హరిదాసులు కానీ, ఆ బుడబుక్కలవాడు కానీ ఎవరూ కనిపించటం లేదు. ఊర్లోకూడా సంక్రాంతి మారిపోయిందనిపిస్తోంది.
ఊరిలో పిండి వంటలు చేసేటప్పుడు అందరం కలిసి కట్టుగా చేసుకునే వాళ్లం.. ఒకరి ఇంట్లో నాలుగైదు ఇళ్ల వాళ్లు కలిసి అందరికీ ఒక్కొక్కరోజు చొప్పున పిండివంటు చేసుకొనేవారు. ఆ వీధంతా పొద్దున్నుండి సాయంత్రం వరకూ అమ్మలక్కలు అంతా తిరుగుతూ ఉండేవారు… ఆ రోజుల్లో పిండివంటలు చేయడంలో మా పెద్దమామ్మ ఎక్స్‌ఫర్ట్. వాడంతా ఆమెను పిలుచుకొని వెళ్లేవారు. అప్పుడప్పుడూ ఆమెతో పాటు నేనుకూడా వెళ్లేదాన్ని. ఈ విషయాలన్నీ ఇప్పుడు పిల్లలకు చెప్తుంటే కథలా వింటున్నారు. కానీ చూపిద్దామంటే ఆ సరదాలు కనిపించడం లేదు.. కానీ ఈసారి కొన్నిటినైనా వారికి పరిచయం చేయాలనిపించింది. అలా మనసులో గతస్మృతులు తిరుగుతుండగానే.. బస్సు విజయవాడ కు వచ్చేంది.
పిల్లలు నిద్రలోకి జారుకున్నారు. విజయవాడ బస్ స్టేషన్ ను విండోలోంచి చూస్తున్నాను. ఇంకెంత సమయం పడుతుందో అని ఆలోచిస్తూ ఉన్నాను. విజయవాడ ఏలూరు దాదాపు 58 కిలో మీటర్లు. అంటే గంటన్నరపైనే బస్పు ప్రయాణం. ఇంతకీ మా ఊరు పేరు చెప్పలేదు కదా.. మా ఊరు ముండూరు. ఏలూరు నుండి 16 కిలోమీటర్ల దూరం. అరగంట ప్రయాణం.
బస్ విజయవాడ నుండి బయలుదేరింది. నాకు నిద్ర వస్తదేమోనని ట్రైచేశాను. కానీ.. నిద్ర రావటంలేదు. మళ్లీ అవే ఆలోచనలు.. పండగ రోజు కొత్త బట్టలు ధరించి గుడికి వెళ్లటం, భోగి రోజు పులగమన్నం, పశ్చిపులుసుతో భోజనం చేయటం, అందరి ముగ్గులు చూసి రావటం.. ఇలా ఎన్నో విషయాలు గర్తొస్తున్నాయి. మా ఇంటి ప్రక్కన అంతా పంటపొలాలు ఉండేవి .సంక్రాంతి టైమ్‌కు అవి అన్నీ ఖాళీగా ఉండేవి. ఆ ప్లేసులో పేకాట, కోడిపందాలు వేసేవారు. నేను ఎప్పుడూ దగ్గరగా చూడలేదు కాని తెలుసు. పోలీసులు వస్తున్నారని వారంతా పరుగులు తీయటం చూసేదాన్ని..
మా వీధిలో రాట్నాలమ్మ గుడి ఉండేది. పండగ తర్వాత అక్కడ రాట్నాలమ్మ తిర్నాలు (జాతర) జరిగేది. అక్కడ రోజూ రాత్రి పూట నాటకాలు పోగ్రామ్ నిర్వహించేవారు. ఆ తిర్నాలు 5రోజులు నిర్వహించేవారు. మేము స్కూల్‌కి వెళ్లేటప్పుడు కూడా చూసుకుంటూ వెళ్లే వాళ్లం. అలా ఆలోచనలో తిరుగుతుండగానే.. బస్సులో లైట్స్ వేశారు. కండక్టర్ నెక్ట్స్ స్టేషన్ ఏలూరు వాళ్లు రెడీగా ఉండండి అని అరుస్తున్నాడు. నేను బ్యాగులు సర్దుతూ, పిల్లలను నిద్ర లేపుతున్నాను.
-బి.పూర్ణిమా