మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ భార్య ఆత్మహత్య!

మంచిర్యాల (CLiC2NEWS): మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ భార్య జ్యోతి (32) మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. ఉదయం విధుల్లోకి వెళ్లిన కమిషనర్ మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చే సరికి ఇంటి తలుపు లోపల గడియ పెట్టి ఉంది. అనుమానంతో తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా బెడ్ రూమ్‌లో జ్యోతి ఫ్యానుకు చున్నితో ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది. దీంతో పోలీసలకు సమాచారం అందించాడు. మంచిర్యాల డిసిపి సుధీర్ రాంనాథ్ కేకన్, ఎసిపి తిరుపతిరెడ్డి, ఎస్సై ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
బాలకృష్ణ వేధింపులతోనే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడినట్లు జ్యోతి తల్లిదండ్రులు గంగవరపు రవీంద్రకుమారి, రాంబాబు ఆరోపించారు. మంగళవారం ఉదయం ఫోన్ చేసి తన భర్త చంపేలా ఉన్నారని చెప్పినట్లు పోలీసులకు తెలిపారు. మున్సిపల్ కమిషనర్‌గా జాబ్ వచ్చిన తర్వాత నుంచి వేధింపులకు గురిచేస్తున్నారని.. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే రూ. కోట్ల కట్నంతో పాటు అందమైన భార్య వచ్చేదని పదేపదే వేధించేవారని తెలిపారు. కమిషనర్ ఇంట్లో శాడిస్ట్‌గా ఉంటూ.. బయట మాత్రం మంచివాడిగా ప్రవర్తించేవాడని తెలిపారు. ఖమ్మం జిల్లా కేశవపురానికి చెందిన బాలకృష్ణ కానిస్టేబుల్ ఉద్యోగం చేసేవాడని, 2014 ఆస్టు 15న పెద్దల సమక్షంలో వివాహం జరిగిందని, మూడెకరాల పొలం, రూ. 2 లక్షల విలువైన బంగారం అందజేసినట్లు తల్లిదండ్రులు తెలిపారు. జ్యోతి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని వేడుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సిఐ నారాయణ్ నాయక్ తెలిపారు.