Mandapeta: విజృంభిస్తున్న విషజ్వరాలు..

మండపేట (CLiC2NEWS): వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల మండపేట పట్టణంలో సీజనల్ వ్యాధులు, వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. గతంలో మాదిరిగానే ప్రజలను వైరల్ జ్వరాలు కుదిపేస్తున్నాయి. ఆసుపత్రుల్లోని ఏ వార్డులో చూసిన జ్వర బాధితులు ఎక్కువగా కనిపిస్తున్నారు. సీజనల్ వ్యాధుల పేరుతో గడిచిన నెలల్లో ప్రజలు ఆసుపత్రుల పాలై అనేక ఇబ్బందులకు గురయ్యారు. డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు ప్రబలి కనీవినీ ఎరుగని విధంగా ప్రజలు మంచం పట్టిన విషయం విధితమే. కానీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గానీ, మున్సిపల్ అధికారులుగానీ అటువంటిదేమీ లేదని కొట్టిపారేశారు.
అవన్నీ వాస్తవం కాదని అధికారులు చెప్పడం జరిగింది. అయినప్పటికీ పురపాలక సంఘం అప్రమత్తమై ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తక్షణ చర్యలు చేపట్టారు. దీంతో అప్పట్లో కేసులు తగ్గుముఖం పట్టి ఉపశమనం కలిగించాయి. అయితే మరల వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో కొత్తగా పెరుగుతున్న కేసులు మళ్లీ కలవరపాటుకు గురిచేస్తున్నాయి. టైఫాయిడ్ దగ్గు జలుబు సాధారణ జ్వరాల బారిన పడి ప్రైవేట్ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీని ప్రభావంతో రోగుల్లో ప్లేట్ లెట్స్ కణాల సంఖ్య కూడా తగ్గి తీవ్ర అస్వస్థతతో భయ బ్రాంతులకు గురి అవుతున్నారు. మండపేట పట్టణంలో ఏ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళినా జ్వరపీడితులతో ఆసుపత్రిలు కనిపిస్తున్నాయి. కొంత మంది పెద్దాసుపత్రులకు వెళ్లే స్తోమత లేక వీదుల్లో ప్రైవేట్ క్లినిక్ లను ఆశ్రయించి చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ఓకే ఒక్క డాక్టర్ రోగులకు వైద్యం అందించడంతో కేవలం ఓపీలను చూసి పంపడం సరిపోతుంది. వైద్యానికి పెద్ద పీట వేస్తూ ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేయడం గమనార్హం.