Mandapeta: తోటకు ఎమ్మెల్యే వేగుళ్ళ సవాల్..

మండపేట (CLiC2NEWS): అక్రమ ఇసుక తవ్వకాల విషయంలో నారాయణలంక ప్రజల తరపున నిలబడింది మీరో నేనో తెలియాలి అంటే నేరుగా నారాయణలంక వెళ్ళి తేల్చుకుందాం.. అక్కడి ప్రజలే నిర్ణయిస్తారు.. ఎవరు ఎవరి తరపున ఉన్నారో..? ఎవరు వారిని బెదిరించారో? తేలిపోతుందంటూ ప్రతిఘటిస్తూ నారాయణలంక వెళ్దామంటూ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు సవాల్ చేశారు.
రెండు రోజులుగా కపిలేశ్వరపురం మండలం నారాయణలంక లంక భూముల్లో ఇసుక మట్టి తవ్వకాల పై తెలుగుదేశం నాయకులకు వైయస్సార్ నాయకులకు మధ్య నడుస్తున్న విమర్శల నేపథ్యంలో మరోసారి ఎమ్మెల్యే వేగుళ్ల స్పందించారు. టీడీపీ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చేసిన వ్యాఖ్యలకు ధీటుగా సమాధానం చెప్పారు.
గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న చందంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వ్యవహార శైలి ఉందని ధ్వజమెత్తారు. నారాయణలంకకు రెండు రోజుల క్రితమే వెళ్ళాను..నేనే ముందెళ్లాను అని చెబుతున్న తోట త్రిమూర్తులుకి లంకలో జరుగుతున్న అన్యాయం కంటికి కనిపించలేదా అని ప్రశ్నించారు. 10 నుండి 15 అడుగుల లోతు తవ్వేసిన గోతులు మసకబారాయా అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పైగా ఇసుక మీద మాట్లాడే నైతిక అర్హత తనకు లేదని తోట త్రిమూర్తులు వ్యాఖ్యానించేముందు వెనక్కి తిరిగి చూసుకుంటే తెలుస్తుందని చురకలు వేశారు.
టీడీపీ హయాంలో మూడు యూనిట్లు లారీ మూడు వేల రూపాయలకే వినియోగదారుల ఇంటికి చేర్చిన ఘనత తమదేనని స్పష్టం చేశారు. ఐదు యూనిట్ల లారీ 20 వేలకు దొరుకుతుంటే తోట త్రిమూర్తులు ఇన్చార్జిగా వచ్చిన అనంతరం అసలు ఇసుక కనుమరుగై పోతుందని దుయ్యబట్టారు. ప్రస్తుతం ఐదు యూనిట్ల లారీ 25000 పెట్టి కొనుగోలు చేద్దామన్నా దొరకని గడ్డు పరిస్థితులు నేడు దాపురించాయని ఆక్షేపించారు.
ఈ సందర్భంగా నారాయణ లంక గ్రామానికి సంబంధించి తోట త్రిమూర్తులు తాను వేసే కొన్ని ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాలని కోరారు. నారాయణ లంకలో మూడెకరాల 62 సెంట్ల లో మాత్రమే ఇసుక తవ్వకాలకు అనుమతులు తీసుకుని నదీ గర్భంలో 15 అడుగులు లోతు తవ్విన విషయం వాస్తవమా కాదా? అని ప్రశ్నించారు. గోదావరి ఏటిగట్టు కుసించుకు పోతుందని నదీగర్భంలోకి లంక గ్రామం కలిసిపోతుందని నారాయణ లంక ప్రజలు మీకు మొర పెట్టుకున్నారా లేదా? ఆ క్రమంలో అక్కడకు వెళ్లి ఎవరైనా నష్టపోతే పరిహారం ఇప్పిస్తానని లేదని అడ్డుపడితే పోలీసు స్టేషన్లలో పెట్టేస్తానని బెదిరించిన మాట నిజమా కాదా అని ప్రశ్నించారు. మీ కంటే నేనే ముందు వెళ్ళాను అని సమర్థించుకుంటున్న తోట త్రిమూర్తులు ఆమీద అక్రమ మైనింగ్ ఎందుకు నిరోధించలేక పోయారో చెప్పాలని అన్నారు.
ఒకరికొకరు మీడియా సమావేశాల్లో విమర్శించుకోవడం విరమించి నేరుగా ఇద్దరం కలిసి నారాయణలంక వెళ్దామని, అక్కడి ప్రజలు ఏ తీర్పు చెబుతారో తెలుసుకుందాం రండంటూ సవాల్ విసిరారు. సీఎంకు నేను చెప్పిందే వేదం నా మాట వేదవాక్కు ఈ రిజర్వేషన్ లు తెచ్చాం, ఆ రిజర్వేషన్ లు సవరించాం ఇదంతా నా మాట మీదే జరిగిందంటూ ప్రగల్బాలు పలికే తోట త్రిమూర్తులు సీఎం మీరు చెప్పినట్టు వినేటట్టు అయితే గతంలో మన మిద్దరం ప్రజలకోసం ఇసుకపై చర్చించు కున్నామని ఆ మాట నెరవేర్చి మీ సత్తా ఏమిటో నిరూపించు కోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ టౌన్ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు పాల్గొన్నారు.