Mandapeta: 2022-23 సంవత్సరం మున్సిపల్ బడ్జెట్ ఆమోదం..
బడ్జెట్లో ఏరియా ఆసుపత్రికి నిధులు కేటాయింపు ఏది..?

మండపేట (CLiC2NEWS): మండపేట మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశం వాడీవేడిగా జరిగింది.
చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి అధ్యక్షతన కౌన్సిల్ హాలులో బడ్జెట్ సమావేశం జరిగింది. బడ్జెట్ పై సుదీర్ఘ చర్చ జరిగింది. బడ్జెట్ లో ఏరియా ఆసుపత్రికి సంబంధించి కోటి యాభై లక్షల రూపాయలు ఎందుకు చూపించలేదనే అంశంపై ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ ల మధ్య సుమారు అరగంట సేపు వాదోపవాదాలు జరిగాయి.
ఈ సమావేశంలో బడ్జెట్ కోసం చర్చిస్తూ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పలు ప్రశ్నలు వేశారు. మండపేట పరిసర ప్రాంతాల ప్రజలకు 100 పడకల ఏరియా ఆసుపత్రి నిర్మిస్తుండగా దానికి సంబంధించి ఏవిధమైన కేటాయింపులు బడ్జెట్ లో లేకపోవడంపై మండిపడ్డారు. రాజ్యసభ సభ్యులు సుభాష్ చంద్రబోస్ కోటి యాభై లక్షల రూపాయలు ఆసుపత్రి నిర్మాణానికి నిధులు కేటాయించారని ఆ నిధులను బడ్జెట్లో ఎందుకు తీసుకురాలేదని కమిషనర్ ను నిలదీశారు.
దీనిపై కమిషనర్ చెప్పిన సమాధానం పట్ల ఎమ్మెల్యే సంతృప్తి చెందక పోవడంతో ఇరువురి మధ్య కొంత సేపు వాగ్వాదం చోటు చేసుకుంది. మండపేటలో ఏరియా ఆసుపత్రి కట్టడానికి మీకు ఇష్టం లేదా అంటూ ప్రశ్నించారు. దీని వెనుక ఎవరైనా ఉన్నారా మీకు ఏమైనా ఉద్దేశాలు ఉన్నాయా అంటూ నిలదీశారు. ఆసుపత్రి నిర్మాణం అవుతుందో లేదో కూడా అనుమానంగా ఉందని ఏదైనా మంచి ఉద్దేశంతో ప్రజలందరికీ వైద్యసేవలు అందించాలని రాజ్యసభ సభ్యులు సుభాష్ చంద్రబోస్ ఆసుపత్రి నిర్మాణానికి పూనుకున్నారని దానికి తామంతా సహకరించామని మీరు ఈ విధంగా వ్యవహరిస్తే ఎలాగని అన్నారు. మీ సొంత ఎజెండాలతో వెళుతున్నారని ఇది మంచిది కాదని ఎమ్మెల్యే కమిషనర్ కు చురకలు వేశారు.
గతంలో తాను ఇనుమర్తి వీరసుభద్ర చైర్మన్ లుగా పని చేసినప్పుడు పరిస్థితి వేరని అన్నారు. ప్రకాష్ చైర్మన్ గా పనిచేసినప్పటి నుండి నిబంధనలు మారాయని వివరించారు. దీనిపై కమిషనర్ రామ్ కుమార్ మాట్లాడుతూ కోటి యాభై లక్షల రూపాయలకు వచ్చే సమావేశంలోనైనా సవరణ బడ్జెట్లో తీసుకురావచ్చని వివరణ ఇచ్చారు. ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి నిధులు ఎందుకు కేటాయించలేదో తనకు రాతపూర్వకంగా ఇవ్వాలని తాను డీఎంవోకు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. అలాగే మండపేట మాస్టర్ ప్లాన్ డీటీసీపీ నుంచి వచ్చి సుమారు ఆరు నెలలు పైనే అయ్యిందని అయితే ఇంతవరకు దానిని కౌన్సిల్‌కు ఎందుకు తీసుకురాలేదని ఎమ్మెల్యే వేగుళ్ల కమిషనర్ ను ప్రశ్నించారు. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్ అమలకు ఆల్రెడీ ఏజెన్సీ తో మాట్లాడామని దీనిపై కౌన్సిలర్ లకు అవగాహన కల్పించడానికి సదస్సు నిర్వహించాల్సి ఉందని చెప్పారు. దీనిపై ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే కౌన్సిల్ సమావేశానికి ఈ అంశాన్ని తీసుకురావాలని తెలియజేశారు.
గతంలో క్రిస్టియన్ స్మశానానికి సంబంధించి స్థలాలు కేటాయించారని అవి ఎక్కడో తెలియజేస్తే వాటిని ప్రజలు వినియోగించుకుంటారని 29వ వార్డు కౌన్సిలర్ పిల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యేను కోరారు. దీనిపై ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను సొంత స్థలాలను క్రిస్టియన్ ఫెలోషిప్ లకు 50 సెంట్లు తన సొంత భూమిని ఇచ్చానని అలాగే క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మరో 20 సెంట్లు భూమి ని వ్యక్తిగతంగా ఇవ్వడం జరిగిందని, వీటికి మున్సిపాలిటీకి ఏ విధమైన సంబంధం లేదన్నారు. వచ్చే సమావేశంలో వీటికి సంబంధించి తాను దస్తావేజులను చూపిస్తానని సమధానం చెప్పారు.
మున్సిపాలిటీలో గత కౌన్సిల్ లో ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరుతో పట్టణ ప్రజలకు రక్షిత మంచినీటిని అందించే వారమని ఇప్పుడు ఆయా ప్లాంటులు పని చేస్తున్నాయా లేదా అని ఆరో వార్డు కౌన్సిలర్ కాసిన కాశీవిశ్వనాధ్ చైర్మన్ ను ప్రశ్నించారు. దీనిపై మున్సిపల్ ఏఈ శ్రీనివాస్ మాట్లాడుతూ రావిచెట్టు వద్ద మోటార్ బోరు మరమ్మతులతో వారం రోజులు పని చేయలేదని నేడు ఆ ప్లాంట్ సక్రమంగానే పనిచేస్తుందన్నారు. అలాగే బస్ స్టాండ్ దగ్గర ప్లాంటు ఏమైందని అడుగగా అక్కడ నిరంతరం మంచి నీటిని అందించడం జరుగుతుందని చైర్పర్సన్ కలుగజేసుకుని తెలియజేశారు. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ సుజల స్రవంతి ప్లాంట్ల వద్ద ఉదయం 7 నుంచి 11 గంటల వరకు అలాగే సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు మంచి నీటిని అందిస్తున్నామని తెలిపారు.
ఎమ్మెల్యే ఆ విధంగా ఎక్కడైనా బోర్డులు పెట్టారా అని ప్రశ్నించగా అన్నిచోట్లా బోర్డులు పెట్టామని కమిషనర్ చెప్పారు. అవి ఎక్కడా కనబడలేదని ఎమ్మెల్యే మాట్లాడగా ప్రజలకు కనిపించేలా ఏర్పాటు చేస్తే మంచిదని వైస్ ఛైర్మన్ లు వేగుళ్ల నారయ్యబాబు, పిల్లి గనేశ్వరారావులు కౌన్సిల్ కు సూచించారు. మంచినీటి సరఫరా అందించే సమయాలను తెలియజేసే బోర్డులు పెట్టాలని చెప్పారు. అలాగే బురుగుంట చెరువు పార్క్ లో వాకింగ్ ట్రాక్ టైల్స్ రాళ్లు లేచిపోయి నడక నడిచే వారికి ఇబ్బందిగా ఉందని ఆ ట్రాక్ ను బాగు చేయాలని చైర్పర్సన్ ను కాశీ విశ్వనాథం కోరారు.