Hyd: మ్యాన్ హోళ్లకు మరమ్మత్తు పనులు చేపట్టిన జలమండలి..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యంగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఇందులో భాగంగా జలమండలి నగరంలోని రహదారులపై ఉన్న మ్యాన్ హోళ్ళకు మరమ్మత్తులు చేపట్టాలని నిన్న (శుక్రవారం) ప్రగతి భవన్ లో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
ఇందులో భాగంగానే జలమండలి ఎండీ ఎం. దాన కిశోర్ శనివారం జలమండలి ప్రధాన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో జలమండలి ఎండి మాట్లాడుతూ.. నగరంలోని రెండు లేన్స్, నాలుగు లేన్స్ లో ఉన్న రోడ్డుకు సమాంతరంగా లేని మ్యాన్ హోళ్ళకు మరమ్మత్తులు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే రెండు, నాలుగు లేన్స్ లో 330 కిలో మీటర్ల మేర ఉన్న రోడ్డుకు సమాంతరంగా లేని దాదాపు 9835 మ్యాన్ హోళ్ళను గుర్తించినట్టు తెలిపారు. ఈ పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈ మ్యాన్ హోళ్ళను రోడ్డుకు సమాంతరంగా నిర్మిస్తున్నట్టు.. దీనికోసం వీటికయ్యే ఖర్చు రూ.12 కోట్లు కేటాయిస్తున్నట్టు ఆయన తెలిపారు. మ్యాన్ హోళ్ళ మరమ్మత్తులు చేపట్టిన ప్రదేశంలో తగిన భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అంతే కాకుండా ఈ మరమ్మత్తులు చేసే సమయంలో సరైన బారికేడింగ్ ఏర్పాటు చేసి నగర పౌరులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని పేర్కొన్నారు. ఈ ఈ మరమ్మత్తు పనులు జులై 10 లోపల వేగంవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఎండీ ఆదేశించారు. నగరంలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న ప్రజా ప్రతినిధులు, జలమండలి అధికారుల పాదయాత్ర లో ప్రజలు, ప్రజాప్రతినిధులు ఏవైనా సమస్యలు జలమండలి అధికారుల దృష్టికి తీసుకువస్తే తక్షణమే వాటిని పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే మ్యాన్ హోళ్ళ లో పూడికతీత పనులు చేపట్టాలని.. ఆ మ్యాన్ హోళ్ళ నుండి వెలికి తీసిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలంగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఎన్సీ, డైరెక్టర్ ఆపరేషన్స్-1 అజ్మీరా కృష్ణ, సీజీఎంలు విజయారావు, ప్రభు, సుజాత, వినోద్ భార్గవ, ఆనంద్ నాయక్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.