వైద్యం కోసం వ‌చ్చిన మావోయిస్టు క‌మాండ‌ర్ క‌మ‌ల అరెస్టు

వ‌రంగ‌ల్ (CLiC2NEWS): మావోయిస్టు క‌మాండ‌ర్ మ‌డ‌కం ఉంగి అలియాస్ క‌మ‌ల వైద్యం కోసం ఆస్ప‌త్రికి వ‌చ్చి తిరిగి వెళ్తున్న క్ర‌మంలో వ‌రంగ‌ల్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటు మ‌రో మావోయిస్టు అసం సోహెన్‌, మ‌రో ముగ్గురిని పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డారు.  ఛ‌త్తీస్‌గ‌ఢ్ దండ‌కారణ్య ప‌రిధిలో మావోయిస్టుల‌కు, పోలీసుల‌కు మ‌ధ్య జ‌రిగిన‌ ఎదురు కాల్పుల్లో 68 మంది పోలీసుల మ‌ర‌ణానికి కార‌ణ‌మైన ఘ‌ట‌న‌ల‌లో క‌మ‌ల ప్ర‌ధాన నిందితురాలు. 2017లో మావోయిస్టు అగ్ర‌నాయ‌కుల‌తో క‌లిసి బుర్కాపాల్ అట‌వీ ప్రాంతంలో జ‌రిపిన దాడిలో 25 మంది పోలీసులు మృతి చెంద‌గా.. 2018లో చింత‌గుప్ప ప‌రిధి మిన‌ప అట‌వీ ప్రాంతంలో జ‌రిగిన ఎదుకాల్పుల్లో ఇద్ద‌రు, 2020లో అదే ప్రాంతంలో మ‌రో 17 మంది పోలీసులు మ‌ర‌ణించారు. 2021లో గుట్ట‌ప‌రివార అట‌వీ ప్రాంతంలో 24 మంది పోలీసులు మృతి చెందిన ఘ‌ట‌న‌ల‌లో ఆమె ప్ర‌ధాన నిందితురాలు.

ఛ‌త్తీస్‌గ‌ఢ్ బీజాపూర్ జిల్లా ముంత‌మ‌డుగుకు చెందిన క‌మ‌ల 15 సంవ‌త్స‌రాల క్రితం మావోయిస్టుల్లో చేరారు. ఆమె ప్ర‌స్తుతం దండ‌కార‌ణ్య సౌత్ స‌బ్‌జోన్ డాక్ట‌ర్స్ టీం క‌మాండ‌ర్‌గా ప‌నిచేస్తున్న‌ట్టు స‌మాచారం. క‌మ‌ల అనారోగ్యానికి గుర‌వ‌డంతో.. చికిత్స నిమిత్తం హ‌నుమ‌కొండలోని అజార ఆసుప‌త్రికి వ‌చ్చారు. చికిత్స అనంత‌రం తిరిగి వెళ్లే క్ర‌మంలో వాహ‌న త‌నిఖీలు నిర్వ‌హిస్తున్న పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. వారివ‌ద్ద నుండి 50 జిలెటెన్‌స్టిక్స్‌, 50 డిటోనేట‌ర్లు, విప్ల‌వ సాహిత్యం, చ‌ర‌వాణిలు, రూ. 74వేల న‌గ‌దుతో పాటు బొలెరో వాహ‌నాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.