ప్రాణహిత పుష్కరాలను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

మంచిర్యాల (CLiC2NEWS): తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రాణహిత నదికి తొలిసారిగా పుష్కరాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం ప్రాణహిత పుష్కరాలను ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, పుణ్య స్నానాలు ఆచరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సి దండే విఠల్, జడ్పి ఛైర్మన్ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
కొమురం భీం జిల్లాలోని తుమ్మిడి హెట్టి నుంచి ప్రారంభమయ్యే ప్రాణహిత నది మంచిర్యాల జిల్లా మీదుగా సుమారు 113 కిలోమీటర్లు ప్రవహించి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఆలయ సమీపంలోని గోదావరి, సరస్వతి నదులతో కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడుతుంది. తెలంగాణలోనే పుట్టి ఇక్కడే ముగిసే జీవనది. గోదావరి నదికి ప్రాణహిత ప్రధాన ఉపనది.