బిజెపికి మోత్కుపల్లి రాజీనామా
![](https://clic2news.com/wp-content/uploads/2021/07/motkupally-750x313.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింములు భారతీయ జనతాపార్టీకి రాజీనామా చేశారు. హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ మేరకు వెల్లడించారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు పంపినట్లు వెల్లడించారు. కాగా తన అనుభవాన్ని, సుధీర్ఘ రాజకీయ చరిత్రను దృష్టిలో పెట్టుకుని అయినా పార్టీలో సముచిత స్థానం కల్పించలేదని మోత్కుపల్లి ఆవేదన వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి ఈటలను పార్టీలో చేర్చుకున్నప్పుడు తనకు ఒక్కమాట కూడా చెప్పకపోవడం ఇబ్బందికి గురిచేంసిందన్నారు. ముఖ్యమంత్రి నిర్వహించిన దళితబంధు కార్యక్రమానికి మోత్కుపల్లి హాజరైన సంగతి తెలిసిందే. సిఎం కెసిఆర్ ఆహ్వానిస్తే ఆ కార్యక్రమానికి బండి సంజయ్ కు చెప్పే వెళ్లానని.. అయినా పార్టీలో భిన్నాభిప్రాయాలు రావడం తనను బాధించిందన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బిజెపికి రాజీనామా చేస్తున్నట్లు మోత్కుపల్లి ప్రకటించారు.
దళితుల సంక్షేమం కోసం దళిత బంధు పథకం అమలుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. దళితుల గుండెల్లో అంబేద్కర్ వారసుడిగా కేసీఆర్ మిగిలిపోతారు. దళిత బంధును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. దళితులందరూ సీఎం కేసీఆర్ అండగా నిలబడి హుజురాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి. ఈ సందర్భంగా మోత్కుపల్లి దరువు వేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విశ్వాసంతోనే బీజేపీకి రాజీనామా చేశాను అని మోత్కుపల్లి నర్సింహులు స్పష్టం చేశారు.