టిఆర్ఎస్‌ను గెలిపిస్తే.. మునుగోడును దత్తత తీసుకుంటానన్న మంత్రి కెటిఆర్

చండూరు (CLiC2NEWS): టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని, నియోజక అభివృద్ధిలో బాధ్యత తీసుకుంటానని మంత్రి కెటిఆర్ హామీ ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నిక టిఆర్ ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కెటిఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చుండూరులో మంత్రి కెటిఆర్ ప్రసంగించారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మునుగోడు కష్టం తెలుసని అన్నారు. పదేళ్ల ముందు.. ఇప్పుడు ఎలా ఉందో, ఇక ఇప్పుడు ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. నల్గొండ జిల్లాను పట్టి పీడుస్తున్న ఫ్లోరైడ్ సమస్యను ఎవరూ పట్టించుకోకపోయినా కెసిఆర్ పరిష్కరించారన్నారు. ఫ్లోరోసిస్ నిర్మూలన కోసం రూ. 19వేల కోట్లు ఇవ్వాలని నీతిఅయోగ్ సిఫార్స్ చేస్తే.. రూ. 18వేల కోట్ల కాంట్రాక్టు రాజగోపాల్ రెడ్డికి ఇచ్చారని మంత్రి కెటిఆర్ తెలిపారు. మునుగోడు ఉప ఎన్నిక.. ఓ కాంట్రాక్టర్ అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతోందని ఈ సందర్భంగా కెటిఆర్ అన్నారు.