`తెలంగాణ దళిత బంధు` పేరుతో కొత్త పథకం

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త పథకం అమలు చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఎస్సీ సాధికారత పథకానికి “తెలంగాణ దళిత బంధు” అనే పేరును ముఖ్యమంత్రి కెసిఆర్ ఖరారు చేశారు. రాష్ట్రంలో దళితుల సమగ్ర అభివృద్ధి కోసం సిఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పైలట్ ప్రాజెక్టు కింద ముందుగా ఒక నియోజకవర్గంలో ఈ పథకం అమలు చేయనున్నారు.
అందులో భాగంగా పైలట్ నియోజకవర్గంగా కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజవర్గాన్ని ఎంపిక చేశారు. సీఎం కేసీఆర్ గతంలో అనేక కార్యక్రమాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమానికి నాందిగా నిర్వహించిన సింహగర్జన సభ మొదలకొని, తాను ఎంతగానో అభిమానించిన రైతుబీమా పథకం దాకా కరీంనగర్ జిల్లా నుంచే సీఎం ప్రారంభించారు. అదేవిధంగా ప్రతిష్టాత్మకమైన రైతుబంధు పథకాన్ని సైతం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కేంద్రంగానే ప్రారంభించారు.
అదే ఆనవాయితీని కెసిఆర్ కొనసాగిస్తూ ‘తెలంగాణ దళిత బంధు’ పథకాన్ని కూడా హుజూరాబాద్ నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రారంభోత్సవ తేదీని త్వరలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించనున్నారు.