ప్రభుత్వ లాంఛనాలతో పునీత్ అంత్యక్రియలు
కుటుంబసభ్యులు, అభిమానుల కన్నీటి వీడ్కోలు

బెంగళూరు (CLiC2NEWS): కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ప్రస్థానం ముగిసింది. పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు అధికార లాంఛనాల నడుమ ఆదివారం ఉదయం పూర్తయ్యాయి. కంఠీరవ స్టూడియోలోని పునీత్ తల్లిదండ్రుల సమాధుల పక్కనే ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఆయన మరణించి రెండు రోజులు అయిన కూడా ఆయన మరణం జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ మరణంతో యావత్ సినిమా ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది.
అంత్యక్రియల్లో సీఎం బొమ్మై, మాజీ సీఎం యడియూరప్ప, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, పలువురు సినీ నటులు పాల్గొన్నారు. తమ అభిమాన నటుడిని చివరిసారిగా చూసుకోవడానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. పునీత్ సోదరుడు రాఘవేంద్ర కుమారుడు వినయ్‌తో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు తెల్లవారు జామున 5 గంటల సమయంలో అంతిమయాత్ర జరిగింది. కంఠీరవ స్టేడియం నుంచి కంఠీరవ స్టూడియో వరకూ భారీ కాన్వాయ్ మధ్య పునీత్ అంతిమయాత్ర నిర్వహించారు. వేలాది మంది అభిమానుల నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది.
శుక్రవారం తెలుగు అగ్ర నటులు చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్, వెంకటేష్, రానా, శ్రీకాంత్, అలీ తదితరులు పునీత్‌రాజ్‌కుమార్‌కు శ్రద్ధాంజలి ఘటించారు.